మంగళవారం 26 జనవరి 2021
National - Dec 02, 2020 , 01:04:50

రద్దు చేయాల్సిందే.. వ్యవసాయ చట్టాలపై తేల్చి చెప్పిన రైతులు

రద్దు చేయాల్సిందే.. వ్యవసాయ చట్టాలపై తేల్చి చెప్పిన రైతులు

  • కేంద్ర మంత్రులతో చర్చలు విఫలం
  • అభ్యంతరాలపై కమిటీకి కేంద్రం ప్రతిపాదన  
  • తిరస్కరించిన రైతు నేతలు 
  • రేపు మరో దఫా భేటీ

వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ప్రతినిధులతో మంగళవారం కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు లేవనెత్తిన పలు అభ్యంతరాలను చర్చించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రతిపాదించింది. దీన్ని రైతు సంఘాల ప్రతినిధులు తోసిపుచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. దీంతో కొలిక్కి రాకుండానే చర్చలు ముగిశాయి. గురువారం మరోసారి చర్చలకు కేంద్రం ఆహ్వానించిందని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. 

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న 35 రైతు సంఘాల ప్రతినిధులతో మంగళవారం సాయంత్రం కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మూడు గంటలపాటు కొనసాగిన ఈ చర్చల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తో పాటు కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, సోవ్‌ు ప్రకాశ్‌ పాల్గొన్నారు. సమావేశం అనంతరం భారత్‌ కిసాన్‌ యూనియన్‌ (ఏక్తా ఉగ్రాహన్‌) అధ్యక్షుడు జోగిందర్‌ సింగ్‌ ఉగ్రాహన్‌ మాట్లాడుతూ.. చర్చలు అసంపూర్ణంగా ముగిశాయన్నారు. గురువారం మరో దఫా చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిందని పేర్కొన్నారు. మరోవైపు, నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించి నిర్దిష్ట అభ్యంతరాలు, సమస్యలను బుధవారంలోపు సమర్పించాలని ప్రభుత్వం రైతు సంఘాలను కోరింది. గురువారం రైతు సంఘాల ప్రతినిధులతో జరిగే భేటీలో వీటిపై చర్చిస్తామని పేర్కొంది. 

జిలేబీ, పకోడి ఇస్తాం!

మంగళవారం రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం నిర్వహించిన భేటీలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకున్నది. సమావేశం విరామ సమయంలో ‘టీ’ తాగాల్సిందిగా రైతు సంఘాల ప్రతినిధులను కేంద్ర మంత్రి తోమర్‌ ఆహ్వానించారు. దీనిపై ప్రతినిధులు స్పందిస్తూ.. ‘తోమర్‌ జీ.. మీరే మా నిరసన ప్రాంతానికి రండి. జిలేబీ, పకోడీతో పాటు ‘టీ’ కూడా అందిస్తాం’అని చమత్కరించారు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి. 

విభజించే కుట్ర

ఎక్కువ మంది సభ్యులతో చర్చలు కొనసాగిస్తే, ఏకాభిప్రాయం రావడం కష్టమని.. అందుకే, తదుపరి భేటీకి 5 నుంచి 7 మంది సభ్యులు రావాలని కేంద్రం కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని బల్దేవ్‌ సింగ్‌ అనే రైతు సంఘం నాయకుడు పేర్కొన్నారు. అయితే, ఈప్రతిపాదనను సభ్యులందరం తిరస్కరించామని తెలిపారు. తమలో తమను విభజించి, తమ డిమాండ్లను అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. 

అవార్డులు వెనక్కిస్తాం

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ‘చలో ఢిల్లీ’ నిరసన కార్యక్రమాలు చేపట్టిన రైతులపై ఢిల్లీ పోలీసులు సాగించిన దమనకాండపై మాజీ క్రీడాకారులు భగ్గుమన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తమ అవార్డులను వెనక్కి ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు, రైతుల నిరసనకు ఢిల్లీ విద్యార్థులు మద్దతు పలికారు. నిరసన కార్యక్రమాల్లో దాదాపు 15 వేల మంది మహిళలు కూడా పాల్గొన్నట్టు రైతు సంఘాల నాయకులు తెలిపారు. గతేడాది జరిగిన షాహీన్‌ బాగ్‌ నిరసనలకు నేతృత్వం వహించి అందరి దృష్టి ఆకర్షించిన వృద్ధ మహిళ బిల్కిస్‌ బానో రైతుల నిరసనలకు సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో సింఘు సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసనల్లో పాల్గొనడానికి ఆమె సిద్ధమయ్యారు. అయితే, కొవిడ్‌-19 దృష్ట్యా ఢిల్లీ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.

ట్రూడో వ్యాఖ్యలపై భారత్‌ అసంతృప్తి

న్యూఢిల్లీ/టొరంటో: ఢిల్లీలో పెద్దఎత్తున నిరసనలు కొనసాగిస్తున్న రైతులకు మద్దతుగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది. ట్రూడో వ్యాఖ్యలు అవాంఛనీయం, నిజాలు తెలుసుకోకుండా చేసినవని పేర్కొంది. ముఖ్యంగా ఒక ప్రజాస్వామిక దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సమంజసం కాదని తెలిపింది. రాజకీయ అవసరాల కోసం దౌత్య చర్చలను తప్పుదోవ పట్టించడం కూడా మంచిది కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ బదులిచ్చారు. గురునానక్‌ దేవ్‌ జయంతి సందర్భంగా కెనడాలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ట్రూడో మాట్లాడుతూ.. ఢిల్లీలో రైతులు చేపడుతున్న శాంతియుత నిరసనలకు తన దేశం అండగా ఉంటుందని చెప్పారు. 


logo