బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 13:31:55

ఆప్‌ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు : కార్యకర్త మృతి

ఆప్‌ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు : కార్యకర్త మృతి

న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేశ్‌ యాదవ్‌ కాన్వాయ్‌పై మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. మోహ్‌రౌలీ నియోజకవర్గం నుంచి నరేశ్‌ యాదవ్‌ గెలుపొందారు. నరేశ్‌ యాదవ్‌ చేతిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కుసుం ఖత్రి ఓడిపోయారు. నరేశ్‌ విజయం అనంతరం ఆయన మద్దతుదారులు, ఆప్‌ కార్యకర్తలు సంబురాల్లో పాల్గొన్నారు. అనంతరం నరేశ్‌ దేవాలయానికి వెళ్లి తన కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కాల్పుల్లో నరేశ్‌కు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కానీ ఆప్‌ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. మరో కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కార్యకర్త మృతిపై ఎమ్మెల్యే నరేశ్‌ దిగ్భ్రాంతి

ఆప్‌ కార్యకర్త మృతిపై ఎమ్మెల్యే నరేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరం. కాల్పుల వెనుక ఉన్న కారణాలో ఏంటో తనకు తెలియదన్నారు. తమపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు త్వరలోనే నిందితులను గుర్తిస్తారని నరేశ్‌ తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని పోలీసులకు ఎమ్మెల్యే నరేశ్‌ యాదవ్‌ సూచించారు. 

అరవింద్‌ కేజ్రీవాల్‌ మూడోసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న విషయం విదితమే. మొత్తం 70 స్థానాలకు గానూ ఆమ్‌ ఆద్మీ పార్టీ 62 స్థానాలను గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్‌ ఒక్క స్థానం కూడా గెలువలేకపోయింది. 2015 ఎన్నికల్లో ఆప్‌ 67 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. 


logo