ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 14:53:49

ఉగ్రవాదులకు ఆయుధాల కొరత

ఉగ్రవాదులకు ఆయుధాల కొరత

ఢిల్లీ : ఒక వైపు చైనా, మరోవైపు పాకిస్తాన్‌ ఉండగా ఉగ్రవాదులకు ఆయుధాల కొరతేంటి అనుకుటుంటున్నారా? నిజమే మరి. కాకపోతే ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల నుంచి భద్రతా బలగాల సిబ్బంది ఏకే-47 రైఫిల్స్‌ కంటే ఎక్కువగా పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హింసాత్మక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న ఉగ్రవాద సంస్థల అగ్ర నాయకులు మాత్రమే అసాల్ట్‌ రైఫిల్స్‌ను వాడుతున్నారన్నారు. మిగతావారు అనగా నూతనంగా నియమితులైనవారు, యువకులు పిస్టల్స్‌ను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 15 వరకు జమ్ముకశ్మీర్‌లో 203 పిస్టల్స్‌ను 152 ఏకే-47 రైఫిల్స్‌ను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదులు మొత్తం 190 హింసాత్మక సంఘటనలకు పాల్పడగా వీటిలో 100 ఘటనలు రిజిస్టర్‌ అయినట్లు తెలిపారు. 44 గ్రనేడ్‌ దాడులు, ఒక ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారన్నారు. ఉగ్రవాదులతో జరిగిన అన్ని ఎన్‌కౌంటర్‌లలో దాదాపుగా ఆయుధాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 

ఉగ్రవాద సంస్థల్లో సీనియర్‌ స్థానాల్లో ఉన్న వ్యక్తులు మాత్రమే ఏకే-47ను కలిగి ఉన్నారన్నారు. అసాల్ట్‌ గన్స్‌ షార్టేజీతో పిస్టల్స్‌ను ఉపయోగిస్తున్నట్లుగా గుర్తించినట్లు సీనియర్‌ సీఆర్‌పీఎఫ్‌ అధికారి ఒకరు వెల్లడించారు. యాంటీ టెర్రర్‌ ఆపరేషన్స్‌, జమ్ముకశ్మీర్‌ యూనిట్‌ హెడ్‌ స్పందిస్తూ... సరైన శిక్షణ లేక సైతం పిస్టల్స్‌ వినియోగం పెరిగినట్లు తెలిపారు. అంతకుమునుపు ఉగ్రవాదులు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవారు. భద్రతా బలగాల చర్యలతో ఇప్పుడు లాంగ్‌ రేంజ్‌ రైఫిల్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు వీలుపడటం లేదన్నారు. ఆయుధాలతో సహా పట్టుబడ్డ కొంతమంది ఉగ్రవాదులను ప్రశ్నించినప్పుడు పిస్టల్స్‌ను సైతం ఆపరేట్‌ చేయడం ఎలాగో వారికి తెలియలేదన్నారు. ఆయుధాల కొరత, శిక్షణలేమితో ఉగ్రవాదులు పిస్టల్స్‌ను వాడుతున్నట్లుగా తెలిపారు. దొరికే పిస్టల్స్‌లో సైతం ఎక్కువగా చైనాకు చెందినవిగా చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారిలో ఎక్కువగా 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు వారేనన్నారు. కొన్నిసార్లు 20 ఏళ్లలోపు యువకులు కూడా చనిపోతున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.