ఆదివారం 05 జూలై 2020
National - Jun 22, 2020 , 14:41:38

మిజోరాంలో నిజాయతీ దుకాణాలు!

మిజోరాంలో నిజాయతీ దుకాణాలు!

 ఐజ్వాల్‌: మానవత్వం, నిజాయతీ.. మనిషికి ఆభరణాల్లాంటివి. ఇవి మనిషిని మహోన్నతులను చేస్తాయి. వీటితోపాటు ప్రేమ, కరుణ, క్షమాగుణం ఉంటే ఆ మనిషి జన్మకు సార్థకత చేకూరుతుంది. ఇవ్వన్నీ ఉన్న మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనం మిజోరాం ప్రజలగురించి, వారి ప్రత్యేక లక్షణం గురించి తెలుసుకోవాల్సిందే. మిజోరాం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌కు కొద్దిదూరంలో ఉన్న సీలింగ్‌ పట్టణంగుండా వెళ్తున్న హైవే రోడ్డుపై అక్కడి ప్రజలు నిజాయతీ దుకాణాలు నిర్వహిస్తూ నమ్మకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు. 

దీని ప్రత్యేకత ఏంటంటే అక్కడ మీకు షాప్‌ కీపర్‌ కనిపించడు.. ఉండడు కూడా.. ఎవరికైనా ఏదైనా వస్తువు కావాలని అనిపిస్తే షాప్‌లోకి నేరుగా వెళ్లి తీసుకోవచ్చు. డబ్బులను ఆ పక్కనే ఉన్న డిపాజిట్‌ బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది. అక్కడి ప్రజలు కూడా నిజాయతీగా వస్తువులను తీసుకొని డబ్బులు బాక్స్‌లో వేస్తుంటారు. అంటే ఈ దుకాణాలు నమ్మకంపై ఆధారపడి పనిచేస్తాయన్నమాట. ఈ విషయాలను ‘మై హోం ఇండియా’ అనే ఎన్జీవో తన అఫీషియల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. అక్కడి ప్రజల నిజాయతీని కొనియాడింది. ఈ కాలంలోనూ నమ్మకంపై నడిచే మనుషులుండడం గొప్ప విషయమని పేర్కొంది. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. తాము జీవితంలో ఒకసారైనా నిజాయతీగల మిజోరాం ప్రజలు నడిపిస్తున్న దుకాణాలను సందర్శిస్తామని కొందరు కామెంట్‌ చేశారు. ఇది చాలా గొప్ప విషయమని, ఇలాంటి దుకాణాలు స్విట్జర్లాండ్‌, జర్మనీలో కూడా ఉన్నాయని పలువురు రీట్వీట్‌ చేశారు.  logo