శనివారం 11 జూలై 2020
National - Jun 28, 2020 , 17:47:06

వచ్చే నెల ఒకటి నుంచి షాపింగ్‌మాల్స్‌ ఓపెన్‌

వచ్చే నెల ఒకటి నుంచి షాపింగ్‌మాల్స్‌ ఓపెన్‌

హర్యానా: కరోనా లాక్‌డౌన్‌తో మూడు నెలలుగా మూసివేసిన గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌ జిల్లాల్లోని షాపింగ్‌మాల్స్‌ను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు హర్యానా సర్కారు పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, కేంద్రం జారీచేసిన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) పాటించేలా షాపింగ్‌ మాల్స్‌ యాజమాన్యాలకు ఆదేశాలు జారీచేశామని తెలిపింది. ‘ ఈ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కొవిడ్‌- 19 కేసుల కారణంగా షాపింగ్‌మాల్స్‌ తెరవకుండా ఆంక్షలు విధించాం. మిగతా అన్ని మునిసిపాలిటీల్లో అనుమతించాం. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఎస్ఓపీ తర్వాత ఈ రెండు జిల్లాల్లోనూ షాపింగ్‌మాల్స్‌ తెరవడానికి అనుమతించాలని నిర్ణయించాం’ అని హర్యానా ప్రభుత్వం వెల్లడించింది.

65 ఏళ్ల కంటే ఎక్కువ, పదేళ్ల కంటే తక్కువ వయస్సున్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, గర్భిణులను షాపింగ్‌మాల్స్‌లోకి అనుమతించరని సర్కారు పేర్కొంది. కాగా,  ఈ నెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సేవలతోపాటు షాపింగ్‌ మాల్స్‌ను నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ తెరుచుకోవచ్చని ఆ రాష్ట్ర హోంశాఖ అనుమతించింది. కేవలం రెండు జిల్లాల్లోనే ఆంక్షలుండగా, ఇప్పుడు అవికూడా ఎత్తివేశారు. ఇదిలా ఉండగా, కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం ఇవి ఇప్పుడే తెరుచుకోవని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.  logo