ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 02:46:19

నా కొడుకును చంపేయండి!

నా కొడుకును చంపేయండి!

  • పోలీసులను కోరిన యూపీ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌దూబే తల్లి
  • దూబే ఇల్లు నేలమట్టం 
  • పోలీసుల వేట ముమ్మరం
  • ఎక్కడ కనిపిస్తే, అక్కడే కాల్చి పారేయండి

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని బిక్రూ గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను దారుణంగా హతమార్చిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేను ఎన్‌కౌంటర్‌ చేసి చంపేయాలని అతని తల్లి సరళాదూబే పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇంతటి పాపానికి ఒడిగట్టిన తన కుమారుడిపై దయాదాక్షిణ్యాలు చూపించాల్సిన అవసరం లేదని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయాడు

తమ చేష్టలతో ఇతరులకు తీవ్రమైన బాధ, నష్టం కలిగించే వాళ్లు తప్పకుండా శిక్షను అనుభవించాలని 60 కేసుల్లో నిందితుడిగా ఉన్న నేరస్థుడు వికాస్‌దూబే తల్లి సరళా దూబే అన్నారు. ‘మార్‌ డాలో ఉన్కో, జహాన్‌ రహే మార్‌ డాలో (వాడు (వికాస్‌ దూబే) ఎక్కడ కనిపిస్తే అక్కడే కాల్చిపారేయండి)’ అని సరళా దూబే శనివారం ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. తమ కొడుకు చేసిన తప్పుకు ప్రభుత్వం ఏ శిక్ష వేసినా తమకు అభ్యంతరం లేదని వికాస్‌  తండ్రి రామ్‌కుమార్‌ దూబే తెలిపారు. ‘నేరపూరితమైన చర్యలకు పాల్పడవద్దని మీ కుమారుడికి చెప్పలేదా?’ అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రామ్‌కుమార్‌ స్పందిస్తూ.. విద్యార్థి దశలో ఉన్నప్పుడే అతడు (వికాస్‌) ఇంటి నుంచి వెళ్లిపోయాడని, తన బావ ఇంట్లోనే పెరిగాడని సమాధానమిచ్చారు.  కాగా యూపీలో కాన్పూర్‌ సమీపంలోని బిక్రూ గ్రామంలో రౌడీమూకల కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందడం తెలిసిందే. 

ఇల్లు నేలమట్టం

నేరస్థుడు వికాస్‌దూబే ఇంటిని కాన్పూర్‌ జిల్లాధికారులు శనివారం నేలమట్టం చేశారు. అతని రెండు కార్లను కూడా ధ్వంసం చేశారు. దూబేకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో భాగంగా 500కు పైగా మొబైల్‌ ఫోన్లను సేకరించామని, నిఘా విభాగం సాయంతో అందులోని డేటాను విశ్లేషిస్తున్నట్టు అధికారులు తెలిపారు.  దూబేపై బిక్రూ గ్రామ ప్రజలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. తన కండబలంతో, రాజకీయ పలుకుబడితో బెదిరింపులకు గురిచేసి ప్రజల నుంచి దూబే డబ్బును గుంజేవాడని కాన్పూర్‌ రేంజ్‌ ఐజీ మోహిత్‌ అగర్వాల్‌ తెలిపారు. గ్రామంలోఅతను నిర్మించిన విశాలమైన ఇళ్లు కూడా ప్రజల నుంచి బలవంతంగా లాక్కున్న స్థలంలోనే కట్టిందని చెప్పారు. దూబే అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు అతని కుటుంబీకులు, బంధువులపై దాడిచేసే అవకాశమున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని వివరించారు.రంగంలోకి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ 

వికాస్‌ దూబేను పట్టుకోవడానికి యూపీ పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గాలింపు కోసం 25కు పైగా బృందాలను ఏర్పాటు చేశారు. స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం కూడా రంగంలోకి దిగింది. దూబేకు సమాచారం తెలియజేస్తే రూ. 50 వేలు అందజేస్తామని యూపీ పోలీసు శాఖ ప్రకటించింది.  బిక్రూ ఘటనతో సంబంధం ఉన్నదన్న ఆరోపణల నేపథ్యంలో చౌబేయ్‌పూర్‌ స్టేషన్‌హౌజ్‌ ఆఫీసర్‌ వినయ్‌ తివారీని అధికారులు సస్పెండ్‌ చేశారు.


logo