గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 13:20:41

జర్నలిస్ట్ హత్య కేసులో ఎస్‌హెచ్‌ఓ సస్పెండ్, 9 మంది అరెస్టు

జర్నలిస్ట్ హత్య కేసులో ఎస్‌హెచ్‌ఓ సస్పెండ్, 9 మంది అరెస్టు

ల‌క్నో : ఘజియాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ విక్రమ్ జోషి హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం ఆరోపణలపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు విజయ్ నగర్ పోలీస్ స్టేషన్.. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) రాజీవ్ కుమార్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ కొత్త ఎస్‌హెచ్‌ఓగా దేవేంద్ర బిష్త్ నియమితులయ్యారు. జ‌ర్న‌లిస్ట్ జోషి(35) స్థానిక హిందీ డైలీలో ప‌నిచేస్తున్నాడు. ఈ నెల 20వ తేదీన త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌తో క‌లిసి ఇంటికి వ‌స్తుండ‌గా దుండ‌గులు కాల్చి చంపారు. ఫిర్యాదుపై పోలీసులు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని జ‌ర్న‌లిస్ట్ కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. జ‌రిగిన దారుణంపై న్యాయ విచార‌ణ జ‌రిపించాల్సిందిగా ప్ర‌తిప‌క్షం సీఎం యోగీ ఆదిత్యానాథ్ స‌ర్కార్‌ను డిమాండ్ చేసింది. 

సీనియ‌ర్ ఎస్పీ క‌ళానిధి నైతాని మాట్లాడుతూ... జ‌ర్న‌లిస్ట్ హ‌త్య కేసులో ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిది మందిని ప‌ట్టుకున్న‌ట్లు తెలిపారు. జోషి ఇచ్చిన వేధింపుల ఫిర్యాదుపై చ‌ర్య‌లు తీసుకోని కార‌ణంగా ప్ర‌తాప్ విహార్ పోలీస్ పోస్టు ఇన్‌ఛార్జీ రాఘ‌వేంద్ర సింగ్‌ను త‌క్ష‌ణం స‌స్పెండ్ చేసిన‌ట్లు చెప్పారు.  

జ‌ర్న‌లిస్ట్ జోషి కుటుంబానికి యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ రూ. 10 ల‌క్ష‌ల స‌హాయాన్ని ప్ర‌క‌టించారు. భార్య‌కు ఉద్యోగం, పిల్ల‌ల‌కు ఉచితంగా చ‌దువు చెప్పించ‌డం చేస్తామ‌న్నారు. కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్రియాంక గాంధీ వాద్రా, ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, బీఎస్పీ చీఫ్ మాయ‌వ‌తి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించారు. logo