మంగళవారం 31 మార్చి 2020
National - Mar 23, 2020 , 16:15:35

మధ్యప్రదేశ్‌ సీఎంగా శివరాజ్‌సింగ్‌!

 మధ్యప్రదేశ్‌ సీఎంగా శివరాజ్‌సింగ్‌!

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. పదమూడేళ్ల పాటు  ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన బీజేపీ సీనియర్‌ నేత  శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2005లో శివరాజ్‌ సింగ్‌ తొలిసారిగా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.   ఇవాళ సాయంత్రం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుండగా బీజేఎల్పీ నేతగా   చౌహాన్‌ను ఎన్నుకోనున్నారు. రాజ్‌భవన్‌లో రాత్రి 9 గంటలకు  గవర్నర్‌ లాల్జీ టాండన్‌..శివరాజ్‌ సింగ్‌తో ప్రమాణం చేయిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.  

22 మంది కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించడంతో  కమల్‌నాథ్‌  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోవడం, ఎమ్మెల్యేల రాజీనామాతో మ్యాజిక్‌ ఫిగర్‌ 104గా మారింది.  దీంతో కాంగ్రెస్‌ బలం 92కు పడిపోవడంతో కమల్‌నాథ్‌ రాజీనామా చేయక తప్పలేదు.  ప్రస్తుతం సభలో 206 మంది శాసన సభ్యులున్నారు. 

 డిసెంబర్‌ 2018  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ 114 చోట్ల విజయం సాధించగా.. బీజేపీ 109, బీఎస్పీ 2, సమాజ్‌వాద్‌ పార్టీ ఒక చోట, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు.  230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో అధికారం చేపట్టాలంటే 116 స్థానాల మ్యాజిక్‌ ఫిగర్‌ రావాలి.  బీఎస్పీ, ఎస్పీ మద్దతుతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 


logo
>>>>>>