ఆదివారం 29 మార్చి 2020
National - Mar 23, 2020 , 16:41:04

ఈ రాత్రికే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ సీఎంగా శివ‌రాజ్‌సింగ్ ప్ర‌మాణం

ఈ రాత్రికే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ సీఎంగా శివ‌రాజ్‌సింగ్ ప్ర‌మాణం

న్యూఢిల్లీ: బీజేపీ సీనియ‌ర్ నేత శివ‌రాజ్ సింగ్ చౌహాన్ మ‌రోసారి మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఏంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే 2013 నుంచి 2018 వ‌ర‌కు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాలు మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంగా ప‌నిచేసిన శివ‌రాజ్ సింగ్.. ఇప్పుడు నాలుగోసారి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ రాత్రి 9 గంట‌ల‌కు సీఎంతోపాటు మంత్రివ‌ర్గం కూడా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

ఇప్ప‌టికే సీఎంగా శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ పేరు ఖ‌రారైనా.. ఫార్మాలిటీ ప్ర‌కారం ఈ సాయంత్రం 6 గంట‌ల‌కు భోపాల్‌లోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో బీజేపీ శాస‌న‌స‌భాప‌క్షం స‌మావేశ‌మై త‌మ నాయ‌కుడిగా శివ‌రాజ్‌సింగ్‌ను ఎన్నుకోనున్న‌ది. కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త విభేదాల కార‌ణంగా మార్చి మొద‌టి వారంలో జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటు చేయ‌డంవ‌ల్ల‌ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ సంక్షోభం ఏర్ప‌డింది. 

జ్యోతిరాధిత్య సింధియా వెళ్తూవెళ్తూ మొత్తం 22 మంది ఎమ్మెల్యేలను త‌న వెంట తీసుకెళ్లారు. ఆ 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాల‌ను స్పీక‌ర్ ప్ర‌జాప‌తి ఆమోదించ‌డంతో క‌మ‌ల్ నాథ్ స‌ర్కారు మైనారిటీలో ప‌డింది. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ లాల్జీ టాండ‌న్ క‌మ‌ల్‌నాథ్‌ను ఫ్లోర్ టెస్టుకు ఆదేశించాడు. అయితే  త‌నకు అవ‌స‌ర‌మైన‌ మెజారిటీ లేద‌ని ముందే గ్ర‌హించిన క‌మ‌ల్ నాథ్.. ఫ్లోర్ టెస్టుకు వెళ్ల‌కుండానే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో ప్ర‌తిప‌క్ష బీజేపీకి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ద‌క్కింది.       


logo