శనివారం 28 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 13:28:35

ఆయన అలా మాట్లాడి ఉండాల్సింది కాదు: తారిఖ్ అన్వ‌ర్

ఆయన అలా మాట్లాడి ఉండాల్సింది కాదు: తారిఖ్ అన్వ‌ర్

ప‌ట్నా: రాహుల్‌గాంధీపై ఆర్జేడీ సీనియ‌ర్ నాయ‌కుడు శివానంద్ తివారీ చేసిన విమ‌ర్శ‌లను కాంగ్రెస్ పార్టీ త‌ప్పుబ‌ట్టింది. శివానంద్ తివారీ చాలా సీనియ‌ర్ నాయ‌కుడని, అలాంటి వ్య‌క్తి ఏదైనా కామెంట్ చేసేట‌ప్పుడు ఆలోచించి మాట్లాడాల‌ని బీహార్ కాంగ్రెస్ నాయ‌కుడు తారిఖ్ అన్వ‌ర్ హిత‌వుప‌లికారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆర్జేడీ పార్టీలాగ కాద‌ని వ్యాఖ్యానించారు. ఆర్జేడీ ఒక ప్రాంతీయ పార్టీ అని, ఆ పార్టీ నేత‌లు బీహార్‌కే చెందిన‌వారై ఉంటార‌ని, కాబ‌ట్టి వారు ఎప్పుడూ అందుబాటులో ఉంటార‌ని ఆయ‌న చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని, ఆ పార్టీ అగ్ర‌నేత‌ ఎప్పుడూ రాష్ట్రంలో అందుబాటులో ఉండ‌టం కుద‌ర‌ద‌ని తారిఖ్ అన్వ‌ర్ అన్నారు. అయినా త‌న అవ‌స‌రం ఎప్పుడు ఉంటే అప్పుడు బీహార్‌కు వ‌స్తాన‌ని రాహుల్‌గాంధీ చెప్పార‌ని, ఆ మేర‌కే ఆయ‌న వ‌చ్చి ప్ర‌చారంలో పాల్గొన్నార‌ని తెలిపారు. ఆర్జేడీ నేత‌ల్లా ఆయ‌న బీహార్‌లోనే ఉండి ప‌నిచేయాలంటే కుద‌ర‌ద‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల వేళ రాహుల్‌గాంధీ హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని త‌న సోద‌రి ఇంటికి పిక్నిక్ వెళ్లార‌ని, ఆయ‌న పార్టీని న‌డిపే విధానం క‌రెక్టు కాద‌ని శివానంద్ తివారీ చేసిన వ్యాఖ్య‌ల‌పై తారిఖ్ అన్వ‌ర్ పై విధంగా స్పందించారు.         ‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.