శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 12:02:23

శివసేన గాజులు ధరించిందేమో.. మేమైతే కాదు

శివసేన గాజులు ధరించిందేమో.. మేమైతే కాదు

ముంబయి : మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్‌.. శివసేన నాయకత్వంపై నిప్పులు చెరిగారు. ఎంఐఎం నాయకుడు వరీష్‌ పఠాన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శివసేన స్పందించకపోవడాన్ని ఫడ్నవీస్‌ తప్పుబట్టారు. శివసేన నాయకులు గాజులు ధరించారేమో.. అందుకే స్పందించలేదు. తామైతే గాజులు ధరించలేదు అని ఫడ్నవీస్‌ అన్నారు. తమకే అధికారం ఉంటే పఠాన్‌కు సరైన సమాధానం ఇచ్చే వాళ్లమని మాజీ సీఎం స్పష్టం చేశారు. 

ఇటీవల కర్ణాటకలోని కలబురాగి ప్రాంతంలో సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పఠాన్‌ మాట్లాడుతూ.. మనమందరం కలిసికట్టుగా ఉండాలి. స్వేచ్ఛను పొందే సమయం వచ్చింది. గుర్తు పెట్టుకోండి.. మనం 15 కోట్ల మందే ఉండొచ్చు.. కానీ 100 కోట్ల మంది కన్నా మన బలం ఎక్కువ.. వారిపై అధిపత్యం చెలాయించగలం అని పఠాన్‌ వ్యాఖ్యానించారు. సీఏఏ నిరసన ప్రదర్శనల్లో మనం మహిళలను ముందు పెట్టాం అని అంటున్నారు. కేవలం ఆడ సింహాలు బయటకు వస్తేనే మీకు ఇప్పటికే చెమటలు పట్టాయి. మేమంతా కలిసికట్టుగా వస్తే ఏమవుతుందో మీరు అర్థం చేసుకోగలరు అని పఠాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

అయితే ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పఠాన్‌ ప్రకటించారు. ఏ కమ్యూనిటీని కూడా తాను టార్గెట్‌ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కొన్ని సంస్థలకు వ్యతిరేకంగానే తాను మాట్లాడాల్సి వచ్చిందన్నారు పఠాన్‌. తాను నిజమైన దేశభక్తుడిని అని పఠాన్‌ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, భజరంగ్‌ దళ్‌ లాంటి ఆర్గనైజేషన్స్‌ అందమైన దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయని పఠాన్‌ పేర్కొన్నారు.


logo