సోమవారం 18 జనవరి 2021
National - Nov 24, 2020 , 00:50:47

‘పుట్ట’ బొమ్మా.. ‘పుట్ట’ బొమ్మా..

‘పుట్ట’ బొమ్మా.. ‘పుట్ట’ బొమ్మా..

మేఘాలయలో  మెరిసే పుట్టగొడుగులు

న్యూఢిల్లీ: ఈశాన్యభారతంలో విస్తారంగా ఉన్న అడవులు.. వైవిధ్యమైన, అరుదైన వృక్ష, జంతుజాలానికి ఆవాసంగా నిలుస్తున్నాయి. శాస్త్రవేత్తలు తాజాగా అక్కడ ప్రత్యేకమైన పుట్టగొడుగులను గుర్తించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇంతకీ వీటి ప్రత్యేకత ఏమిటంటారా? ఇవి సాధారణమైనవి కావు.. మెరిసే పుట్టగొడుగులు. ఇవి ఆకుపచ్చ రంగులో మెరుస్తుండడం చూపరులను కట్టిపడేస్తున్నది. మేఘాలయలోని ఈస్ట్‌కాశీహిల్స్‌ జిల్లాలో గత ఆగస్టులో మొదట వీటిని గుర్తించారు. తర్వాత వెస్ట్‌జైంతియా హిల్స్‌ జిల్లాలో ఇవి కనిపించాయి. ఈ ‘ఎలక్ట్రిక్‌ మష్రూమ్స్‌' గురించి స్థానికులు తెలుపడంతో భారత్‌, చైనాకు చెందిన పరిశోధకుల బృందం వెస్ట్‌జైంతియా హిల్స్‌లో పర్యటించింది. స్థానికుడు ఒకరు వారికి గైడ్‌గా వ్యవహరించారు. అడవిలో కొంతదూరం వెళ్లాక  టార్చ్‌లైట్లు ఆపాలని అతడు బృందాన్ని కోరాడు. అంతే.. ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తున్న ఆ పుట్టగొడుగులను చూసి బృంద సభ్యులు నోరెళ్లబెట్టారు.

జీవ సందీప్తి.. 

జీవసందీప్తి కారణంగానే పుట్టగొడుగులు కాంతిని వెదజల్లుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక జీవిలో కాంతి ఉత్పత్తి అయి బయటకు వెలువడటాన్ని జీవసందీప్తి అంటారు. వృక్షాలు, మొక్కలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాల్లో ఈ ప్రక్రియ జరుగుతుంటుంది. సాధారణంగా సముద్రజీవ జాతుల్లో ఇది కనిపిస్తుంటుంది. జీవుల్లో వెలువడే ప్రకాశవంతమైన రంగు.. వాటి రసాయనిక ధర్మాలపై ఆధారపడి ఉంటుంది.