గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 25, 2020 , 01:06:40

సుప్రీంకోర్టుకు ‘షాహీన్‌బాగ్‌' నివేదిక!

సుప్రీంకోర్టుకు ‘షాహీన్‌బాగ్‌' నివేదిక!
  • సమర్పించిన మధ్యవర్తుల కమిటీ
  • రేపు పరిశీలిస్తామన్న ధర్మాసనం

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో సుమారు రెండు నెలలుగా జరుగుతున్న నిరసనలపై సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ హెగ్డే సుప్రీంకోర్టుకు సోమవారం సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించారు. జస్టిస్‌లు ఎస్‌కే కౌల్‌, కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం ఈ నివేదికను బుధవారం పరిశీలిస్తామన్నది. ఈ నివేదిక కేవలం కోర్టు కోసమేనని, దీని వివరాలను ఎవరికి ఇవ్వబోమని స్పష్టం చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా గత ఏడాది డిసెంబర్‌ 15 నుంచి షాహీన్‌బాగ్‌ వద్ద నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిరసనకారులు రహదారిని అడ్డగించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపిస్తూ న్యాయవాది అమిత్‌ సహానీ ఢిల్లీ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే నంద కిషోర్‌ గార్గ్‌ కూడా వేరుగా పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు నిరసనలు తెలిపే హక్కు వారికి ఉన్నదని, అయితే దీనివల్ల ఇతరులకు అసౌకర్యం కలిగించకూడదని, ఎవరికీ ఇబ్బంది లేనిచోట నిరసనలు తెలుపొవచ్చని చెప్పింది. నిరసనకారులతో చర్చలు జరుపాలని సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ హెగ్డేను ఈ నెల 17న సుప్రీంకోర్టు కోరింది. logo