బుధవారం 27 జనవరి 2021
National - Dec 29, 2020 , 12:17:52

ఏడు రాష్ట్రాల్లో న్యూ ఇయర్‌ వేడుకలకు బ్రేక్

ఏడు రాష్ట్రాల్లో న్యూ ఇయర్‌ వేడుకలకు బ్రేక్

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో న్యూ ఇయర్‌ వేడులకు పలు రాష్ట్రాలు బ్రేక్‌ వేశాయి. ఇప్పటికే వైరస్‌ మహమ్మారితో విలయం సృష్టిస్తుండగా.. బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌తో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ నెల ప్రారంభంలో యునైటెడ్ కింగ్‌డమ్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త స్ట్రెయిన్‌ అనేక ఇతర యూరోపియన్ దేశాలకు వ్యాపించింది. భారత్‌ సహా పలు దేశాల్లో విమానాలపై తాత్కాలిక నిషేధం విధించాయి. మహమ్మారి మరింత వ్యాప్తిని నియంత్రించడానికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంవత్సర వేడుకలకు ముందు మార్గదర్శకాలను ప్రకటించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 నుంచి జనవరి 5వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించింది. ముంబై, పుణెతో పాటు పెద్ద నగరాల్లోనూ బహిరంగ నూతన వేడుకలకు అనుమతించడం లేదు. కర్ణాటకలోనూ గురువారం సాయంత్రం 6గంటల నుంచి 6 గంటల వరకు కర్ఫ్యూ విధించడంతో పాటు క్లబ్‌లు, పబ్‌లు, రెస్టారెంట్‌లతో పెద్ద ఎత్తున సమావేశాలపై జనవరి 2వ తేదీ వరకు నిషేధం విధించారు.

తమిళనాడులో క్లబ్‌, పబ్‌లు, బీచ్‌ రిసార్ట్స్‌, రెస్టారెండ్లు, బీచ్‌లలో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌ను ప్రభుత్వం నిషేధించింది. రెస్టారెంట్లు, పబ్‌లు తెరిచేందుకు అనుమతి ఇచ్చినా.. కొవిడ్‌ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. మెరీనా బీచ్ న్యూ ఇయర్ సందర్భంగా మూసివేసింది. పంబాబ్‌లోనూ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. వివాహాలు, పార్టీలు, ఇతర కార్యక్రమాలు, సామూహిక సామావేశాలపై నిషేధం విధించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో జనవరి 5వ తేదీ వరకు సిమ్లా, మండి, కంగ్రా, కులులో రాత్రి కర్ఫ్యూ విధించారు. ఆయా జిల్లాలో బహిరంగ నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. రాజస్థాన్‌లోనూ ప్రభుత్వం గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లోనూ నూతన సంవత్సర పార్టీలు, పటాకులు పేల్చడంపై నిషేధం విధించింది. ఉత్తరాఖండ్‌లో హోటళ్లు, బార్‌, రెస్టారెంట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై డెహ్రాడూన్‌ పరిపాలన అనుమతి నిరాకరించింది.


logo