శనివారం 06 జూన్ 2020
National - May 24, 2020 , 01:04:10

రేసులో రెమ్‌డెసివిర్‌ ముందంజ

రేసులో రెమ్‌డెసివిర్‌ ముందంజ

  • కరోనా ఔషధ తయారీకి ముమ్మరంగా ప్రయోగాలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర వ్యాధులకు వాడే ఔషధాలు కరోనాను నిరోధించగలవా అన్నది కూడా పరీక్షిస్తున్నారు. వీటిలో యాంటీవైరల్‌ రెమ్‌డెసివిర్‌ ముందు వరుసలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రెమ్‌డెసివిర్‌ తీసుకున్న రోగులు 31 శాతం వేగంగా కోలుకున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఫావిపిరవిర్‌పైనా క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఔషధ తయారీలో భారత్‌ కూడా కీలకపాత్ర పోషిస్తున్నది. ఫావిపిరవిర్‌ తయారు చేసే టెక్నాలజీని హైదరాబాద్‌లోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ’ అభివృద్ధిచేసింది. ఫావిపిరవిర్‌తోపాటు రెమ్‌డెసివిర్‌, కోల్చిసిన్‌పైనా సీఎస్‌ఐఆర్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నది. 

తొలి వ్యాక్సిన్‌ సురక్షితం!

మనుషుల్లో తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరిన మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌ ‘ఎడీ5-ఎన్‌కోవ్‌' సురక్షితమైనదిగా కనిపిస్తున్నదని తాజా అధ్యయనం వెల్లడించింది.108 మందిపై ఈ వ్యాక్సిన్‌ను పరీక్షించగా ఆశాజనక ఫలితాలు వెలువడినట్లు పరిశోధకులు చెప్పారు. ఈ వ్యాక్సిన్‌ 14 రోజుల్లో యాంటీబాడీస్‌ని, రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన టీ-సెల్స్‌ను ఉత్పత్తిచేసినట్లు వివరించారు. 


logo