శనివారం 06 జూన్ 2020
National - May 13, 2020 , 12:58:58

7 నెలల గర్భిణి.. 800 కి.మీ. కాలినడక..

7 నెలల గర్భిణి.. 800 కి.మీ. కాలినడక..

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులకు కష్టాలు తప్పడం లేదు. పొట్టకూటి కోసం వలసొచ్చిన కార్మికులు తమ సొంతూర్ల బాట పట్టారు. గర్భిణులు కూడా ఎర్రటి ఎండలో నడక మార్గాన సొంతూర్లకు వెళ్తున్నారు. ఓ ఏడు నెలల గర్భిణి.. హైదరాబాద్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు కాలినడకన బయల్దేరింది. ఈ గర్భిణి సొంతూరుకు చేరుకోవాలంటే 800 కిలోమీటర్లు నడవాల్సిందే. మంగళవారం మధ్యాహ్నం వరకు 170 కిలోమీటర్లు నడిచిన గర్భిణిని.. ఓ ఇంగ్లీష్‌ మీడియా పలుకరించింది. 

ఛత్తీస్‌గఢ్‌ బిలాస్‌పూర్‌కు చెందిన రహమాన్‌, రేణు(32) దంపతులు 2018లో హైదరాబాద్‌లోని బాచుపల్లికి వలస వచ్చారు. బాచుపల్లిలోని పరిశ్రమల్లో పని చేస్తూ ఈ దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రేణు ఏడు నెలల గర్భిణి. అయితే లాక్‌డౌన్‌ అమలు చేయడంతో వీరికి ఉపాధి కరువైంది. రోజు గడవడం కష్టమైంది. దీంతో తమ సొంతూరుకు వెళ్లాలని రహమాన్‌ దంపతులు నిర్ణయించుకున్నారు. 

ఈ క్రమంలో బిలాస్‌పూర్‌కు రహమాన్‌, రేణు రెండు రోజుల క్రితం బయల్దేరారు. మంగళవారం మధ్యాహ్నం సమయానికి ఇందల్వాయి టోల్‌గేట్‌(నిజామాబాద్‌) వద్దకు చేరుకున్నారు. ఇక్కడ వారిని ఓ ఇంగ్లీష్‌ మీడియా పలుకరించింది. శ్రామిక్‌ రైళ్లలో సీట్లు దొరక్కపోవడంతో.. రోడ్డుమార్గాన నడకను ఎంచుకున్నామని రేణు తెలిపింది. ఆకలితో చనిపోతున్నాం. సొంతూరికి వెళ్తే ఎలాగైనా బతుకొచ్చు అని చెప్పింది. 

తెలంగాణ ప్రభుత్వం గత నెలలో 12 కిలోల బియ్యం, రూ. 500లు సాయం చేసింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కానీ అవేమీ సరిపోవడం లేదు. తినడానికి తిండి కూడా లేదు. ఈ క్రమంలోనే తాము సొంతూరుకి వెళ్తున్నామని రేణు దంపతులు చెప్పారు. 


logo