శనివారం 06 జూన్ 2020
National - May 19, 2020 , 11:57:49

మహారాష్ట్ర, యూపీలో ఘోరం.. ఏడుగురు మృతి

మహారాష్ట్ర, యూపీలో ఘోరం.. ఏడుగురు మృతి

ముంబై/లక్నో: లాక్‌డౌన్‌తో పనులులేక ఇబ్బదులు పడుతున్న వలస కూలీలను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. పొట్టచేతపట్టుకుని వలస వచ్చిన నగరాల్లో ఉపాధి లేకపోవడంతో స్వస్థలాలకు వెళ్తున్న కార్మికులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మంగళవారం తెల్లవారుజామున మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు వలసకూలీలతోపాటు, బస్సు డ్రైవర్‌ మరణించారు. 

మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లాలో వలస కార్మికులు వెళ్తున్న ప్రైవేటు బస్సు పారిశుద్ధ్య వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌తోపాటు,  ముగ్గురు వలస కార్మికులు మృతిచెందారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 22 మంది గాయపడ్డారు. వీరంతా జార్ఖండ్‌లోని తమ స్వస్థలాలకు చేరుకోవడానికి శ్రామిక్‌ ప్రత్యేక రైళు కోసం నాగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నారని అదనపు ఎస్పీ నూరుల్‌ హుస్సేన్‌ తెలిపారు. 

ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వలస కార్మికులు మరణించగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. 17 మంది వలస కార్మికులతో ఢిల్లీ నుంచి వస్తున్న వాహనం వస్తున్నదని, ఝాన్సీ-మీర్జాపూర్‌ హైవేపై ఆ వాహనం టైరు పేలిపోవడంతో ఒక్కసారిగా బోల్తాపడిందని మహోబా ఎస్పీ ఎంఎల్‌ పటీదార్‌ తెలిపారు.


logo