బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 07, 2020 , 02:16:30

జేబుదొంగకు ఉరిశిక్షా?

జేబుదొంగకు ఉరిశిక్షా?
  • కాంగ్రెస్‌ సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి.. విపక్షాల డిమాండ్‌
  • 54వేల కోట్ల అదనపు వ్యయం కోసం పార్లమెంట్‌ ఆమోదం కోరిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని విపక్ష సభ్యు లు శుక్రవారం లోక్‌సభలో డిమాండ్‌చేశారు. వారిపై ఆ శిక్ష సరికాదని, నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. స్పీకర్‌ టేబుల్‌పై ఉన్న పత్రాలను లాక్కుని, చించేసినందుకు ఏడుగురు కాంగ్రెస్‌ సభ్యులపై గురువారం సస్పెన్షన్‌ వేటు పడిన సంగతి తెలిసిందే. దుష్ప్రవర్తనతోపాటు నిబంధనలను ఉల్లంఘించినందుకు బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు వారి ని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్యానెల్‌ స్పీకర్‌ మీనాక్షి లేఖి ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌రంజన్‌ చౌదరి మాట్లాడుతూ.. ఏ ప్రాతిపదికన సభ్యులను సస్పెండ్‌ చేశారో అర్థం కావడం లేదన్నారు. ఈ శిక్ష జేబుదొంగకు ఉరిశిక్ష విధించినట్లుగా ఉందని, అది సరికాదన్నారు.


 సస్పెన్షన్‌ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌చేశారు. సభాధ్యక్ష స్థానాన్ని ‘వాటికన్‌ పోప్‌'తో సమానంగా కాంగ్రెస్‌ సభ్యులు పరిగణిస్తారని, ఆ స్థానాన్ని తామెన్నడూ అగౌరవపరచలేదని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ.. ‘సస్పెండైన ఎంపీలను జేబుదొంగతో పోల్చడం ఆశ్చర్యం. ఇది దురదృష్టకరం’ అని అన్నారు. మరోవైపు, సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు పార్లమెంట్‌ ఆవరణలో నిరసన చేపట్టారు. కాగా, రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం, రక్షణ ఖర్చుల నిమిత్తం రూ.54 వేల కోట్ల అదనపు వ్యయానికి పార్లమెంట్‌ ఆమోదం కోసం ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రతిపాదనలను సభలో  ప్రవేశపెట్టారు. 


చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలి!

అధికార పక్షం, విపక్షాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుని, సభ సజావుగా నడిచేలా చూడాలని రాజ్యసభ చైర్మన్‌ ఎం వెంకయ్యనాయుడు సూచించారు. ఢిల్లీ హిం సాకాండపై విపక్షాల నిరసనల నేపథ్యంలో ఆయన సభను వాయిదా వేశారు. 


logo