శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 12:38:49

పూజించిన మెషీన్లను త‌గ‌ల‌బెట్ట‌డం.. రైతుల‌ను అవ‌మానించ‌డ‌మే: ప‌్ర‌ధాని మోదీ

పూజించిన మెషీన్లను త‌గ‌ల‌బెట్ట‌డం.. రైతుల‌ను అవ‌మానించ‌డ‌మే: ప‌్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్‌: నూత‌నంగా ఏర్ప‌డిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఢిల్లీలోని ఇండియా గేటు వ‌ద్ద ట్రాక్ట‌ర్‌ను ద‌హ‌నం చేసిన ఘ‌ట‌న‌ను ప్ర‌ధాని మోదీ త‌ప్పుప‌ట్టారు.   ఇన్నాళ్లూ పూజించిన మెషీన్లు, ప‌రిక‌రాల‌కు ఇప్పుడు నిప్పుపెట్టి రైతుల‌ను అవ‌మానిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.  ఓపెన్ మార్కెట్‌లో రైతులు త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకునేందుకు ప్ర‌తిప‌క్షాలు అడ్డుప‌డుతున్నాయ‌ని ఆరోపించారు. మ‌ధ్య‌వ‌ర్తులు, ద‌ళారులు లాభం పొందే విధంగా ప్ర‌తిప‌క్షాల చ‌ర్య‌లు ఉన్నాయ‌ని మోదీ విమ‌ర్శించారు.  రైతుల స్వేచ్ఛ‌ను వారు హ‌రిస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.  ఉత్త‌రాఖండ్‌లో నామామి గంగే మిష‌న్ కింద ప‌లు ప్రాజెక్టుల‌ను ఇవాళ ప్ర‌ధాని మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో రైతులు, కార్మికులు, ఆరోగ్యానికి సంబంధించి సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చిన‌ట్లు మోదీ తెలిపారు. 

న‌ల్ల‌ధ‌నానికి గండి..

తాము తెచ్చిన సంస్క‌ర‌ణ‌ల‌తో కార్మికులు, యువ‌త‌, మ‌హిళ‌లు, రైతులు బ‌లోపేతం అవుతార‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. కానీ కొంద‌రు త‌మ స్వార్థం కోసం ఎలా ఆ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తున్నారో దేశ ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఎక్క‌డైనా, ఎప్పుడైనా, ఎవ‌రికైనా త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకునే హ‌క్కును రైతుల‌కు క‌ల్పించిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు.  రైతుల‌కు తాము హ‌క్కులు క‌ల్పిస్తుంటే.. వాటిని ప్ర‌తిప‌క్షాలు అడ్డుకుంటున్నాయ‌ని విమ‌ర్శించారు.  క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌పై విప‌క్షాలు రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయ‌ని ప్ర‌ధాని అన్నారు.  ప్ర‌తి పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పిస్తామ‌ని, త‌మ పంట‌ను ఎక్క‌డైనా అమ్ముకునే విధంగా రైతుకు స్వేచ్చ క‌ల్పిస్తామ‌ని ప్ర‌ధాని చెప్పారు. అయితే కొంద‌రు ఈ స్వేచ్ఛ‌ను త‌ట్టుకోలేక‌పోతున్న‌ట్లు తెలిపారు. న‌ల్ల ధ‌నం ఆర్జించే వారి ప్ర‌య‌త్నాల‌కు గండిప‌డిన‌ట్లు మోదీ ఆరోపించారు.