బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 08, 2020 , 11:54:04

స్పుత్నిక్ ట్ర‌య‌ల్స్‌.. డాక్ట‌ర్ రెడ్డీస్ ప్ర‌తిపాద‌న‌ తిర‌స్క‌ర‌ణ‌

స్పుత్నిక్ ట్ర‌య‌ల్స్‌.. డాక్ట‌ర్ రెడ్డీస్ ప్ర‌తిపాద‌న‌ తిర‌స్క‌ర‌ణ‌

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం ర‌ష్యా తయారు చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌ను భారీ స్థాయిలో నిర్వ‌హించాల‌నుకున్న డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది.  విస్తృత స్థాయిలో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను భార‌త డ్ర‌గ్ రెగ్యూలేట‌రీ సంస్థ తిర‌స్క‌రించింది.  విదేశాల్లో అతి స్వ‌ల్ప స్థాయిలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించార‌ని,  దాని భ‌ద్ర‌త‌, ఇమ్మ్యూనోజెనిసిటీ డేటా కూడా స‌రిగా లేద‌ని,  భార‌తీయుల భాగ‌స్వామ్యం కూడా లేద‌ని సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్డ్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్‌(సీడీఎస్‌సీవో) పేర్కొన్న‌ది.  స్పుత్నిక వీ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌ను భార‌త్‌లో స్వ‌ల్ప స్థాయిలో నిర్వ‌హించాలంటూ డాక్ట‌ర్ రెడ్డీస్ సంస్థ‌కు సీడీఎస్‌సీవో ఆదేశించింది.  

భార‌త్ తీసుకున్న నిర్ణ‌యం ఒక ర‌కంగా ర‌ష్యా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌కు బ్రేక్‌ప‌డిన‌ట్లు అయ్యింది.  భార‌త్‌లో వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో.. వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ భారీ స్థాయిలో నిర్వ‌హించాల‌ని డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ భావించింది.  ర‌ష్యా సంస్థ కూడా ఇదే కోణంలో త‌మ వ్యాక్సిన్‌కు ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించాల‌ని అనుకున్న‌ది. వాస్త‌వానికి ఇండియాలో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించేందుకు డాక్ట‌ర్ రెడ్డీస్ సంస్థ .. ర‌ష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌(ర‌ష్య‌న్ డైర‌క్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌)తో ఒప్పందం కుదుర్చుకున్న‌ది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ర‌ష్యా ప్ర‌భుత్వం స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఇప్ప‌టికే మార్కెట్లోకి తెచ్చింది.  ట్ర‌యల్స్ పూర్తి స్థాయిలో జ‌ర‌గ‌క‌ముందే.. టీకా మార్కెట్లోకి రావ‌డం ప‌ట్ల కొంత ఆందోళ‌న వ్య‌క్తం అవుతున్న‌ది.