e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home Top Slides ఊపిరి ఉక్కిరి బిక్కిరి

ఊపిరి ఉక్కిరి బిక్కిరి

ఊపిరి ఉక్కిరి బిక్కిరి
  • రాష్ర్టానికి అవసరమైన ఆక్సిజన్‌ను వెంటనే పంపండి
  • అవసరమైతే కాళ్లు మొక్కమన్నా మొక్కుతాం
  • కేంద్రానికి మహా ఆరోగ్యమంత్రి రాజేశ్‌ తోపే విజ్ఞప్తి
  • మా ఆక్సిజన్‌ను అడ్డుకొంటున్నారు..న్యాయం కాదు
  • పొరుగు రాష్ర్టాలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆరోపణ
  • ఢిల్లీలో దవాఖానల గేట్లకు నో ఆక్సిజన్‌ బోర్డులు
  • ఆక్సిజన్‌ అందక ఉత్తరప్రదేశ్‌లో ఐదుగురు మృతి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: దేశంలో నెలకొన్న కరోనా సంక్షోభాన్ని ఆక్సిజన్‌ కొరత మరింత తీవ్రతరం చేస్తున్నది. ప్రాణవాయువు దొరక్క ఆక్సిజన్‌ అవసరం ఉన్న అన్ని రకాల రోగులు అల్లాడుతున్నారు. రోగుల దైన్యాన్ని చూసి వైద్యులు, కుటుంబసభ్యులు నిస్సహాయులై కండ్లనీళ్లు పెట్టుకొంటున్నారు. మెడికల్‌ ఆక్సిజన్‌ను వెంటనే పంపాలంటూ వివిధ రాష్ర్టాల సీఎంలు, మంత్రులు, ఇతర నేతలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆక్సిజన్‌ కోసం కేంద్రం కాళ్లు కూడా పట్టుకోవడానికి సిద్ధమేనని మహారాష్ట్ర హోంమంత్రి రాజేశ్‌ తోపే చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. దేశవ్యాప్తంగా దవాఖానల గేట్లకు ‘నో ఆక్సిజన్‌’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆక్సిజన్‌ అందక ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఐదుగురు కొవిడ్‌ రోగులు చనిపోయారు.కేంద్రప్రభుత్వం తమకు కేటాయించిన కోటాలో ఒడిశా నుంచి ఆక్సిజన్‌ను తీసుకురావడానికి విమానాలను వినియోగిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు.

ఆక్సిజన్‌ ఉత్పతి ్తఅవుతున్న రాష్ర్టాల నుంచి ఢిల్లీకి రావాల్సిన ఆక్సిజన్‌ను ఆయా రాష్ర్టాలు అడ్డుకొంటున్నాయని ఆరోపించారు. ‘దేశం చాలా పెద్ద ఉపద్రవం ఎదుర్కొంటున్నది. ఇది ఉమ్మడి సమస్య. అందరం కలిసికట్టుగా పోరాడాలి. మన మధ్య విభజనలు వస్తే అది దేశానికి మంచిది కాదు. అందరం భారతీయుల్లా, మనుషుల్లా ఒక్కటవ్వాలి. సొంత అవసరాల కోసం అని చెప్పి ఢిల్లీకి కేటాయించిన ఆక్సిజన్‌ను అడ్డుకోవడం న్యాయం కాదు’ అని అన్నారు. రాష్ర్టాలు ఒకదానికొకటి సాయం చేసుకోవాలన్నారు. ఢిల్లీలో తీవ్రత దృష్ట్యా ఆక్సిజన్‌ సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని అన్ని రాష్ర్టాలను కోరారు. ఢిల్లీకి సరఫరా అవుతున్న ఆక్సిజన్‌ను హర్యానా, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అడ్డుకొంటున్నారని ఢీల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఆరోపించారు. పరిస్థితులు ప్రమాదకరంగా మారకముందే ఈ విషయంలో కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని, సాయం చేయాలని కోరారు. అవసరమైతే పారా మిలిటరీ బలగాలను ఉపయోగించుకొని ఆక్సిజన్‌ సరఫరా సాఫీగా జరిగేలా చూడాలన్నారు. ‘మూడు రోజులుగా జంగిల్‌ రాజ్‌ పరిస్థితులు నెలకొన్నాయి’ అని వ్యాఖ్యానించారు.

ప్రజల ప్రాణాల కోసం ఏమైనా చేస్తాం
ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్‌ తోపే అన్నారు. అవసరమైతే కేంద్రం కాళ్లు కూడా పట్టుకొంటామన్నారు. రాష్ర్టాలకు ఆక్సిజన్‌ సరఫరా కేంద్రం చేతుల్లోనే ఉందని, రాష్ర్టాల అవసరాలను మెడికల్‌ ఆక్సిజన్‌ను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్‌ రవాణాకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

సప్లయర్లు ఫోన్లు తీయడం లేదు
ఢిల్లీలో అనేక దవాఖానల్లో ఆక్సిజన్‌ నిల్వలు నిండుకొన్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో కేంద్రం ఢిల్లీకి ఆక్సిజన్‌ను సరఫరా చేసినప్పటికీ చిన్నచిన్న దవాఖానలకు ఆక్సిజన్‌ చేరలేదు. సప్లయర్లు ఫోన్లు తీయడం లేదని దవాఖానల యాజమానులు చెప్తున్నారు. కొన్ని దవాఖానల్లో గేటు బయట ‘క్షమించండి. ఆక్సిజన్‌ లేకపోవడం వల్ల రోగులను చేర్చుకోవడం లేదు’ అంటూ బోర్డులు పెడుతున్నారు. కరోనా రోగులకు వైద్యం అందడం లేదు.

నిమిషానికి 15 లీటర్ల ఆక్సిజన్‌ సీఎస్‌ఐఆర్‌ వినూత్న సాంకేతికత
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: దేశంలో ఆక్సిజన్‌ కొరత నెలకొన్న వేళ.. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) శుభవార్త చెప్పంది. ఆక్సిజన్‌ డిమాండ్‌ను చేరుకోవడంతో పాటు.. సరఫరా, నిల్వలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించడానికి కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసినట్టు వెల్లడించింది. ఈ సాంకేతికతను తమ సంస్థకు చెందిన సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఈఆర్‌ఐ) ల్యాబ్‌లో అభివృద్ధి చేసినట్టు వెల్లడించింది. దీని సాయంతో 90 శాతం స్వచ్ఛతతో.. నిమిషానికి 15 లీటర్ల మెడికల్‌ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయవచ్చని, డిమాండ్‌ ఎక్కువగా ఉంటే 30 శాతం స్వచ్ఛతతో నిమిషానికి 70 లీటర్ల ఆక్సిజన్‌ను తయారు చేయవచ్చని సీఎస్‌ఐఆర్‌-సీఎంఈఆర్‌ఐ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ హరీశ్‌ హిరానీ తెలిపారు. ఈ యూనిట్‌ను చిన్న దవాఖానల్లో, మినీ ఐసీయూల్లో, ఐసోలేషన్‌ వార్డుల్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. దీంతో నిల్వ, సరఫరా సమస్యలు ఉండవన్నారు. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఉన్న అపోలో కంప్యూటింగ్‌ ల్యాబోరేటరీస్‌కు ఈ సాంకేతికతను బదిలీ చేసినట్టు వెల్లడించారు. మే రెండో వారంలో ఈ సాంకేతికతతో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్రారంభిస్తామని అపోలో ల్యాబ్‌ ప్రతినిధి జైపాల్‌ రెడ్డి పేర్కొన్నారు.

ఇవీ కూడా చదవండి…

ప్రజాసంక్షేమంపై ప్రత్యేక దృష్టి

కష్టకాలంలో సర్కారు సాయం

గోదావరి జలాలతో సస్యశ్యామలం

Advertisement
ఊపిరి ఉక్కిరి బిక్కిరి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement