శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 14:00:14

చేపలు విక్రయించి.. పేదల ఆకలి తీర్చిన దివ్యాంగుడు

చేపలు విక్రయించి.. పేదల ఆకలి తీర్చిన దివ్యాంగుడు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టం విజయవాడ పట్టణంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న రాణిగారి తోటా కాలనీలో దాసరి దుర్గారావు అనే చేపల వ్యాపారి లాక్‌డౌన్‌ కాలం నుంచి వలస కార్మికులు, పేద ప్రజలకు ఆహారం పంచుతూ తన ఉదారతను చాటుకుంటున్నాడు. దుర్గారావు తన రెండేళ్ల వయస్సు నుంచి పోలియో వాధ్యిని కలిగి ఉన్నాడు. 

ప్రతి ఉదయం దుర్గారావు తెల్లవారుజామున 4 గంటలకు లేచి తన త్రీ-వీలర్ స్కూటీలో 40 కి.మీ దూరంలో ఉన్న గుంటూరుకు బయల్దేరుతాడు. అక్కడి ప్రధాన కూరగాయల మార్కెట్ దగ్గర ఒక ఫుట్‌పాత్ వద్ద దుకాణాన్ని ఏర్పాటు చేసి చేపలను విక్రయిస్తాడు. అతను తాజా చేపలను తీసుకురావడం వల్ల అతడి వద్దకే వినియోగదారులు అధిక సంఖ్యలో వస్తుంటారు. 

"అదృష్టవశాత్తు నా వ్యాపారం హాయిగా జరుగుతోంది. ఇప్పటివరకు నేను ఎలాంటి నష్టాలు చూడలేదు.’’ అని దుర్గారావు తెలిపాడు. వారాంతంలో రోజుకు సుమారు రూ.10,000 నుంచి 12,000 అమ్మకాలు జరిపేవాడని దుర్గారావు చెప్పుకొచ్చాడు. ఇంటికి వెళ్లిన తరువాత భార్య నాగాలక్ష్మికి రూ.2500 అంటే తన సంపాదనలో ఒక వంతు ఇంట్లో ఇచ్చి మిగిలిన మూడు వంతులు పేదలు, ఆకలితో ఉన్నవారికి ఆహారం, నిత్యావసరాలు కొనడానికి ఖర్చు చేస్తానని దుర్గారావు తెలిపాడు. 

"లాక్‌డౌన్‌ కాలంలో ప్రతి రోజు నేను వందలాది మంది వలస కార్మికులను, వారి పిల్లలతో పాటు గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్తుంటే చూసేవాడిని. వారిని చూస్తే నా మనస్సు తరుక్కు పోయేది. ఆకలితో ఉన్న అనేక కుటుంబాలను చూసి తట్టుకోలేక వారి ఆకలి తీర్చడానికి చేయగలిగిందంతా చేస్తున్నాను’’ అని దుర్గారావు తెలిపాడు. 

వారానికి మూడురోజులు తన చేపల వ్యాపారాన్ని ముగించిన తరువాత రావు ఇంటికి తిరిగి వచ్చి తన స్కూటీలో ఆహార ప్యాకెట్లను తీసుకెళ్తాడు. అన్నం, కూర, సాంబార్‌, పప్పు కలిగిన ఈ ప్యాకెట్లను గుంటూరు-విజయవాడ మార్గం వెంట వెళ్లే వలస కార్మికులు, పేదలకు అందజేసేవాడు. ఇలా మూడు నెలలపాటు అందజేసినట్లు దుర్గారావు పేర్కొన్నాడు. తన భార్య నాగలక్ష్మి సాయంతో రోజుకు 400-500 మందికి ఆహార ప్యాకెట్లు అందజేసేవాడినని ఆయన పేర్కొన్నాడు. 

మార్చి చివరి వారంలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి దుర్గారావు ఆహార ప్యాకెట్లు పేదలకు అందజేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కాలంలో నిత్యావసరాలను కూడా పంపిణీ చేసినట్లు దుర్గారావు పేర్కొన్నాడు. "మచిలీపట్నం వంటి దూర ప్రాంతాల నుంచి నాకు ఫోన్‌ కాల్స్‌ వచ్చేవి. అక్కడి పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందజేసేందుకు నేను సుమారు 70 కి.మీ ప్రయాణం చేసేవాడినని’’ తెలిపాడు. .

పదో తరగతి వరకు చదువుకున్న దుర్గారావు 2010లో తన తండ్రి మరణించిన తరువాత చేపల అమ్మకం వ్యాపారాన్ని వారసత్వంగా పొందాడు. అదే చేపల విక్రయాన్ని ఇప్పుడు జీవనోపాధిగా మార్చుకున్నాడు. దుర్గారావుకు ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారు. 

"ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం తన జీవిత ఉద్దేశం’’ అని దుర్గారావు చెప్పుకొచ్చాడు. తన ఆదాయంలో నాలుగింట మూడొంతులు పేదలకు ఆహారం ఇవ్వడానికి మాత్రమే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అంగ వైకల్యానికి గాను ప్రభుత్వం అతడికి నెలకు రూ.3000 పింఛన్‌ ఇస్తుండగా వాటిని కూడా దుర్గారావు దాతృత్వానికి ఉపయోగిస్తానని తెలిపాడు. 

తన ప్రయత్నానికి మద్దతు ఇవ్వమని ప్రజలను అభ్యర్థించడానికి దుర్గారావు ఇటీవల ఒక ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కూడా ఓపెన్‌ చేశాడు. "ఈ లాక్‌డౌన్‌ కాలంలో పది మంది నాకు సాయం చేశారు. కొందరు రెండు బియ్యం సంచులను విరాళంగా ఇచ్చారు. మరికొందరు రూ.5,000 నుంచి 10,000 వరకు నగదును ఇచ్చారు" అని ఆయన చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo