గురువారం 26 నవంబర్ 2020
National - Nov 01, 2020 , 20:01:21

లైంగికదాడికి గురైన ఆత్మగౌరవ మహిళలు చనిపోతారు : కేరళ పీసీసీ చీఫ్‌

లైంగికదాడికి గురైన ఆత్మగౌరవ మహిళలు చనిపోతారు : కేరళ పీసీసీ చీఫ్‌

తిరువనంతపురం : కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ''లైంగికదాడికి గురైతే.. ఆత్మగౌరవం కలిగివున్న మహిళ చనిపోతుంది. లేదంటే మరలా తనపై లైంగికదాడి జరుగనివ్వదు'' అన్నారు. సౌర కుంభకోణానికి సంబంధించిన 'బ్లాక్ మెయిల్ రాజకీయాల' గురించి మాట్లాడుతున్నప్పుడు.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముల్లపల్లి రామచంద్రన్‌ వ్యాఖ్యలపై విపక్షాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. వివరణ విడుదల చేసి ఈ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని, దీని నుంచి బయటపడటానికి మార్గాలను పరిశీలిస్తున్నానని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పారు.

కేరళ రాజధాని తిరువనంతపురంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన నిరసన కార్యక్రమంలో ముల్లపల్లి రామచంద్రన్ మాట్లాడారు. 2013 సోలార్‌ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు సరిత నాయర్ వంటి వారిని తీసుకురావడం ద్వారా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 'బ్లాక్ మెయిల్ రాజకీయాలకు' ప్రయత్నిస్తున్నారని కేపీసీసీ చీఫ్ ఆరోపించారు. "ముఖ్యమంత్రి గారు ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఇక్కడ పనిచేయవు. ప్రజలు దీనిని అర్థం చేసుకోగలరు. మీరు మునిగిపోయేటప్పుడు చివరి ప్రయత్నంగా వ్యభిచారిణిని తీసుకువచ్చి ఈ విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. "ఒక మహిళ తనపై ఒకసారి లైంగికదాడి జరిగిందని చెబితే మనం అర్థం చేసుకోవచ్చు. అదే ఆత్మగౌరవంతో బతికే మహిళ తనపై మళ్లీ లైంగికదాడి జరిగిందని చెప్పకుండా చనిపోతారు లేదా మరలా అలా జరగనివ్వరు" అని అన్నారు.

ముల్లపల్లి రామచంద్రన్‌ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. "ఈ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని, దీని నుంచి బయటపడటానికి మార్గాలను పరిశీలిస్తున్నానని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను" ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో సీపీఐ (ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్.. కేరళ ప్రజలను గల్ఫ్ నుంచి స్వదేశానికి తిరిగి రాకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నదని ముల్లపల్లి రామచంద్రన్ ఆరోపించారు. సచివాలయం ముందు నిరాహార దీక్ష కూడా చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.