ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 08:46:08

అయోధ్యలో భద్రత కట్టుదిట్టం

అయోధ్యలో భద్రత కట్టుదిట్టం

అయోధ్య : అయోధ్యలో రామ ఆలయం భూమిపూజ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం పటిష్ట బందోబస్తు కల్పించింది. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు ప్రముఖులు, 135 సంస్థలకు చెందిన వివిధ మత సంస్థలకు చెందిన సాధువులు తరలిరానున్నారు. ఇప్పటికే భూమిపూజ సందర్భంగా ఉగ్రదాడులు జరగవచ్చన్న ఇంటిలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ఇప్పటికే అయోధ్య పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. నగరంలో రాకపోకలపై ఆంక్షలు భద్రతా బలగాలు ఆంక్షలు విధించాయి. అయోధ్యను ఆనుకొని ఉన్న 9 జిల్లాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య- నేపాల్‌తో సరిహద్దు కలిగి ఉన్న బస్తీ డివిజన్‌లో ప్రత్యేకంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు.

సరిహద్దు ప్రాంతాలు, జలమార్గాలపై నిఘా పెంచారు. రామాలయ భూమిపూజలో కొవిడ్‌ ప్రోటోకాల్‌ కఠినంగా పోలీస్‌ అధికారులు అమలు చేస్తున్నారు. 45 ఏళ్ల లోపు ఉండి, కరోనా నెటిగివ్‌ వచ్చిన వారికే ప్రధాని భద్రతా బృందంలో చోటు కల్పించారు. భద్రతలో భాగంగా జిల్లా సరిహద్దులు మూసివేయడంతో పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. పట్టణంలోకి వచ్చే మార్గాలను మూసివేయడంతోపాటు 75 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ పర్యవేక్షణకు డ్రోన్లను సైతం వినియోగిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సాయుధ పోలీస్‌ బలగాలతో పాటు ప్రావిన్షియల్ సాయుధ కాన్స్టాబులరీ (పీఏసీ), కేంద్ర సాయుధ పోలీసు దళం (సీఏపీఎఫ్‌)ను మోహరించనున్నారు. ఇప్పటికే యూపీ డీజీపీ, చీఫ్‌ సెక్రెటరీతో పాటు సీనియర్‌ అధికారులంతా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo