మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 03, 2020 , 02:21:57

బీహార్‌లో నేడే రెండో విడుత

బీహార్‌లో నేడే రెండో విడుత

  • 94 స్థానాల్లో పోలింగ్‌ 
  • తేజస్వితో సహా బరిలో మంత్రులు 

పాట్నా: బీహార్‌లో మంగళవారం జరిగే రెండోదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 17 జిల్లాల పరిధిలోని 94 అసెంబ్లీ సెగ్మెంట్లలో 1,463 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2.85 కోట్ల మందికి పైగా ఓటర్లు ఖరారు చేయనున్నారు. ఈ దఫా పోలింగ్‌లో మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, సీఎం నితీశ్‌కుమార్‌ క్యాబినెట్‌లోని నలుగురు మంత్రులు, సినీ నటుడు శత్రఘ్నసిన్హా తనయుడు లవ్‌సిన్హా తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు. తేజస్వీ తన కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాఘోపూర్‌లో, ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌.. సమస్తిపూర్‌ నుంచి పోటీలో ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 10 శాతం (146) మంది మహిళలు మాత్రమే పోటీలో ఉన్నారు. కాగా, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు వివిధ పార్టీల నుంచి పోటీలో ఉన్న 3,722 మంది అభ్యర్థుల్లో 32 శాతం (1,201) మందికి నేర చరిత్ర ఉందని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌ సంస్థ తెలిపింది. 

10 రాష్ర్టాల్లో నేడు ఉప ఎన్నికలు

భోపాల్‌: దేశవ్యాప్తంగా 10 రాష్ర్టాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉపఎన్నికలు జరుగనున్నాయి. మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికలపైనే ప్రధానంగా అందరి దృష్టి నెలకొంది. ఆ రాష్ట్రంలో 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వ భవితవ్యం వీటిపైనే ఆధారపడి ఉన్నది. రాష్ట్రంలోని 229 స్థానాల్లో ప్రస్తుతం బీజేపీకి 107 మంది సభ్యులున్నారు. సాధారణ మెజార్టీకి మరో 8 మంది ఎమ్మెల్యేల అవసరం. ఈ ఏడాది ప్రారంభంలో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబావుటా ఎగురవేయడంతో కాంగ్రెస్‌ సర్కారు కుప్పకూలింది. 25 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ (1), గుజరాత్‌(8), యూపీ (7), ఒడిశా (2), నాగాలాండ్‌ (2), కర్ణాటక (2), జార్ఖండ్‌ (2), ఛత్తీస్‌గఢ్‌(1), హర్యానా (1)లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 

అవసరమైతే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల వేతనాలు ఆపైనాసరే.. రాష్ట్రంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం.
- తేజస్వీ యాదవ్‌, మహాకూటమి సీఎం అభ్యర్థి