శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 03, 2020 , 09:47:22

బిహార్‌లో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్‌

బిహార్‌లో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్‌

పాట్నా : బిహార్‌ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. 243 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 94 నియోజకవర్గాల్లో రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. 17 జిల్లాలోని 94 నియోజకవర్గాలకు సుమారు 1463 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా మహారాజ్‌గంజ్‌ స్థానానికి 27 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. అత్యల్పంగా దారౌలిలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో 146 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌ ఒకరు పోటీలో నిలిచారు. రెండో దశలో మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌, ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌తో పాటు ప్రస్తుత జేడీయూ సర్కారులోని నలుగురు మంత్రులు, సీనియర్‌ రాజకీయ నాయకులు బరిలోకి దిగారు. బిహార్‌లో తొలి దశ పోలింగ్‌ అక్టోబర్‌ 28న జరగ్గా.. పోలింగ్‌ 54శాతం నమోదైంది. మూడో విడత ఎన్నికలు ఈ నెల 7న జరుగునుండగా.. ఈ నెల 10న ఫలితాలు వెలవడనున్నాయి. 

46 సీట్లలో బీజేపీ పోటీ

బిహార్‌ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీ(యూ)తో కలిసి బీజేపీ కలిసి పోటీ చేస్తోంది. రెండో దశలో 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండగా 46 సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది. జేడీ(యూ) తరఫున 43 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తాజాగా ఎన్డీయేలో చేరిన ముకేశ్‌ సాహ్ని వీఐపీ పార్టీ ఐదు స్థానాల్లో బరిలో ఉంది. మహాకూటమిలో 56 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేస్తోంది. మిత్రపక్షం కాంగ్రెస్‌ 24, సీపీఐ, సీపీఎం నాలుగు సీట్లలో పోటీపడుతున్నాయి. అలాగే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ 52 స్థానాల్లో తన అభ్యర్థులను నిలిపింది. తొలిసారిగా పార్టీ లింగమార్పిడి అభ్యర్థిని బరిలోకి దింపింది.

వార్తల్లో నిలిచిన యువతి

బిహార్‌ ఎన్నికల్లో యువతి వార్తల్లో నిలిచింది. సైకిల్‌పై ఓ యువతి పోలింగ్‌ కేంద్రానికి తన వెంట అమ్మమ్మతో పాట్నాలోని ఓ పోలింగ్‌ కేంద్రానికి ఓటు వేసేందుకు వచ్చింది. ‘నేను నానమ్మతో ఓటు వేసేందుకు వచ్చాను. నేను మొదటిసారి ఓటు వేస్తున్నాను. ఇప్పుడు యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయని నేను నమ్ముతున్నాను’ అని తెలిపింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.