ఆదివారం 07 జూన్ 2020
National - Apr 02, 2020 , 12:54:47

పారిశుద్ధ్య కార్మికుడికి కరోనా పాజిటివ్‌

పారిశుద్ధ్య కార్మికుడికి కరోనా పాజిటివ్‌

ముంబయి : మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ధారవి స్లమ్‌ ఏరియాలో కరోనా వైరస్‌ కోరలు చాచింది. ఇప్పటి వరకు వైద్యులకు, నర్సులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వార్తలు చూశాం. కానీ తాజాగా ఓ పారిశుద్ధ్య కార్మికుడి(52)కి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ధారవి స్లమ్‌ ఏరియాలో ఉండే ఓ వ్యక్తి గురువారం ఉదయం కరోనా వైరస్‌తో మృతి చెందారు. ఇప్పుడు శానిటైజేషన్‌ వర్కర్‌కి కరోనా సోకడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ పారిశుద్ధ్య కార్మికుడు బృహణ్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్నాడు. బాధిత వ్యక్తి వోర్లిలో ఉంటున్నప్పటికీ ధారవి స్లమ్‌ ఏరియాలో డ్యూటీ వేశారు. ప్రస్తుతం కార్మికుడిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  

ముంబయిలోని ధారవి స్లమ్‌ ఏరియాలో కరోనా వైరస్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆసియాలోనే ఇది అతిపెద్ద స్లమ్‌ ఏరియా. ధారవిలో నివసిస్తున్న ఓ వ్యక్తి కరోనా అనుమానిత లక్షణాలతో బుధవారం సాయంత్రం సియాన్‌ ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత చనిపోయాడు. ఈ వ్యక్తి నివాసముంటున్న భవనాన్ని అధికారులు సీజ్‌ చేసినట్లు సమాచారం. ఈ భవనంలో ఉంటున్న మిగతా ఏడు కుటుంబాలను హోం క్వారంటైన్‌లో ఉంచారు. వీరందరికి ఇవాళ కరోనా టెస్టులు నిర్వహించనున్నారు.

ఆ స్లమ్‌ ఏరియాలో ఉంటున్న 10 లక్షల మంది సంగతేంటి?

ధారవి స్లమ్‌ ఏరియాలో 10 లక్షల మంది ఉంటున్నారు. మరి అక్కడుంటున్న ఓ వ్యక్తి కరోనా వైరస్‌తో చనిపోవడంతో.. మిగతా వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 10 లక్షల మందిలో ఎంత మందికి కరోనా సోకిందో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 59 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జస్‌లోక్‌ ఆస్పత్రిలోని ఔట్‌ పేషెంట్‌ విభాగంలో పని చేస్తున్న ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆ ఆస్పత్రిని మూసివేశారు.


logo