బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 02:12:25

కరోనా భయంతో..

కరోనా భయంతో..
  • దిగ్బంధం దిశగా రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు
  • విద్యాసంస్థలు, థియేటర్లు, మాల్స్‌ బంద్‌
  • ఐపీఎల్‌ టోర్నమెంట్‌ వాయిదా..
  • దేశంలో రెండో కరోనా మరణం నమోదు
  • ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం నాటికి
  • కరోనా మరణాలు 5,040
  • అత్యధికంగా చైనాలో 3,176
  • ఇటలీలో 1,016, ఇరాన్‌లో 514
  • మొత్తంగా 121 దేశాల్లో వైరస్‌
  • బారినపడినవారి సంఖ్య 1,34,000

న్యూఢిలీ, మార్చి 13: భారత్‌లో కరోనా కోరలు చాస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. పలు రాష్ర్టాలు షట్‌డౌన్‌ మోడ్‌లోకి వెళ్లాయి. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లను మూసివేయడంతోపాటు ప్రజా, క్రీడా కార్యక్రమాలను నిలిపివేశాయి. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వాయిదా పడగా.. భారత్‌, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ రద్దయింది. ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు, థియేటర్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఐపీఎల్‌తో పాటు అన్ని క్రీడా కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. కర్ణాటకలోని కలబురిగిలో దేశంలోనే తొలి కరోనా మరణం నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలో మరొకరు మృతిచెందారు. కరోనా నియంత్రణకు కర్ణాటక ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. 


వారంపాటు అన్ని యూనివర్సిటీలు, థియేటర్లు, మాల్స్‌, పబ్‌లు, క్లబ్‌లను మూసివేస్తున్నట్లు సీఎం యెడియూరప్ప ప్రకటించారు. మరోవైపు, ఈ నెలాఖరు వరకు స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని బీహార్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అలాగే జూలు, పార్క్‌లనూ మూసివేయాలని నిర్ణయించింది. ఇంకోవైపు, ముంబై, నవీముంబై, పుణే, పింప్రి, నాగ్‌పూర్‌లలో థియేటర్లు, జిమ్‌లు, స్విమింగ్‌పూల్స్‌, మాల్స్‌ను మూసివేయాలని మహారాష్ట్ర సర్కారు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఈనెల 22 వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఒడిశా సర్కారు కరోనాను విపత్తుగా ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ సదస్సులు, సమావేశాలు, వర్కషాప్‌లను రద్దుచేసింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్‌లను మూసివేయాలని ఆదేశించింది.  


తరగతులు బంద్‌

కరోనా నేపథ్యంలో ఐఐటీ-కాన్పూర్‌ ఈ నెల 29 వరకు అన్ని తరగతులు, పరీక్షలను నిలివేసింది.  ఈ నెల 15లోగా హాస్టళ్లు ఖాళీచేసి వెళ్లాలని ఐఐటీ ఢిల్లీ తమ విద్యార్థులను ఆదేశించింది. జేఎన్‌యూ కూడా ఈ నెలాఖరు వరకు తరగతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 30 వరకు ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌, ఇజ్రాయెల్‌, దక్షిణకొరియా, శ్రీలంక దేశాలకు సర్వీసులను నిలిపివేయాలని ఎయిరిండియా నిర్ణయించింది.


అమెరికా వల్లనే కరోనా 

కరోనా మహమ్మారికి కారణం నువ్వంటే నువ్వని చైనా, అమెరికా ఆరోపించుకుంటున్నాయి. కరోనా వ్యాప్తికి అమెరికానే కారణమని, వైరస్‌ను ఆ దేశ ఆర్మీ వుహాన్‌కు తెచ్చిందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్‌ ఆరోపించారు. తన వాదనను సమర్థించుకుంటూ శుక్రవారం ఓ వార్తా కథనం లింక్‌ను కూడా ట్విట్టర్‌లో ఆయన పోస్టు చేశారు. 


82కు పెరిగిన కేసులు

దేశంలో కరోనా కేసులు 82కి పెరిగినట్లు కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. ఇందులో 16 మంది ఇటాలియన్లు కాగా, ఒకరు కెనడాకు చెందినవారు. వైద్య శాఖ అధికారులు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ హెల్త్‌ఎమర్జెన్సీ కాదని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. చైనాతోసహా, వివిధ దేశాల నుంచి ఇప్పటివరకు 1,031 మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు తెలిపారు. ఇరాన్‌, ఇటలీలో చిక్కుకుపోయిన వారిని వెనక్కి తీసుకొస్తామన్నారు. కరోనా బాధితులను కలిసిన 4,000 మందిని క్వారెంటైన్‌లో ఉంచినట్లు చెప్పారు. కాగా, బెంగళూరు క్యాంపస్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగికి కరోనా సోకినట్లు గూగుల్‌ సంస్థ వెల్లడించింది.


యూవీ కాంతితో బస్సుల శుద్ధి

బీజింగ్‌: కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా చైనా అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నది. దీంట్లో భాగంగా.. సాధారణ ప్రజలు ఎక్కువ గా తిరిగే బస్సులు, లిఫ్టులను ఆ దేశ అధికారులు అతినీలలోహిత(ఆల్ట్రావైలేట్‌-యూవీ) కాంతితో శుద్ధి చేస్తున్నా రు. రసాయనంతో ఒక్కో బస్సు శుభ్రం చేయడానికి 40 నిమిషాలు పట్టేదని, యూవీ శుద్ధీకరణ ప్రక్రియ 5 నిమిషాల్లో పూర్తవుతున్నదన్నారు.


మరొకరు బలి

దేశంలో కరోనా కాటుకు మరొకరు బలయ్యారు. రాజధాని ఢిల్లీలో తొలి మరణం నమోదైంది. జనక్‌పురికి చెందిన 68 ఏండ్ల మహిళ ఆర్‌ఎంఎల్‌ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య రెండుకు పెరిగింది. కర్ణాటకలోని కలబురిగికి చెందిన 76 ఏండ్ల వ్యక్తి  కరోనాతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.


ప్రాణాంతక కరోనా వైరస్‌ గురించి శుక్రవారం ఆసక్తికర విషయం బహిర్గతమైంది. ఏడేండ్ల క్రితం అంటే 2013 జూన్‌ 3న మార్కో ఎకోర్టెస్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌.. ‘కరోనా వైరస్‌ వస్తున్నది’ అని చేసిన ట్వీట్‌  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నది. ఇప్పటి వరకు 1.10 లక్షల మంది లైక్‌ చేశారు. మరోవైపు 1981లో డియాన్‌ కూంట్జ్‌ రాసిన ‘ది ఐస్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌' థ్రిల్లర్‌ నవలలో ‘వుహాన్‌-400’ అనే వైరస్‌ గురించి ప్రస్తావించారు. చైనా సైనిక ల్యాబోరేటరీ.. జీవాయుధాల తయారీలో భాగంగా దీన్ని సృష్టించిందని అందులో పేర్కొన్నారు.


 34 మంది హోం ఐసొలేషన్‌

దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలో కరోనా మరణం నమోదవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కలిబురిగిలో మృతిచెందిన వ్యక్తికి  హైదరాబాద్‌తోనూ లింక్‌లు ఉండటంతో రాష్ట్ర రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ తక్షణ చర్యలు చేపట్టింది. ఆ వృద్ధుడికి గతంలో చికిత్స అందించిన హైదరాబాద్‌లోని మూడు ప్రైవేట్‌ దవాఖానల వైద్య సిబ్బందిని ట్రాకింగ్‌ చేశారు. మొత్తం 34 మందిని గుర్తించి, వారందరినీ వైద్యశాఖ పర్యవేక్షణలో హోం ఐసొలేషన్‌లో ఉంచారు. కరోనా  లక్షణాలున్నవారికి పరీక్షలు చేశారు. రిపోర్టులు రావాల్సి ఉన్నది.


logo