సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 13:44:17

తీరప్రాంత ఇళ్లలోకి చేరిన సముద్రపు నీరు

తీరప్రాంత ఇళ్లలోకి చేరిన సముద్రపు నీరు

కొచ్చి : కేరళ రాష్ట్రంలోని కొచ్చి నగర సమీపంలోని సముద్ర తీరప్రాంతమైన చెల్లనం గ్రామంలోకి సముద్రపు నీరు వచ్చి చేరింది. అసలే కరోనా వైరస్ వ్యాప్తితో సతమతమవుతున్న ఆ గ్రామ ప్రజలు తమ ఇండ్లలోకి సముద్రం నీరు అలల ద్వారా రావడంతో ఆందోళన చెందుతున్నారు. గతంలో సముద్రపు నీరు ఇళ్లలోకి చేరినప్పుడు గ్రామ ప్రజలు సమీపంలోని వారి బంధువుల ఇంటికి వెళ్లేవారు. కానీ ఇప్పుడు కరోనా వల్ల ఆ అవకాశం కూడా లేకుండాపోయింది. నీరు చేరినా అవే ఇళ్లల్లో ఉండిపోయారు. చెల్లనం గ్రామంలో 200 కరోనా కేసులు నమోదైనాయి. వీటికితోడు ఇళ్లలోకి సముద్రపు నీరు రావడంతో 12 ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు.


ఈ పరిస్థితి గురించి చెల్లనం గ్రామ పంచాయతీ అధ్యక్షుడు మెర్సీ జోసీ మాట్లాడుతూ ‘చాలా చోట్ల ఇళ్లు పడిపోతున్నాయి, నాకు ఖచ్చితమైన లెక్క లేదు. చాలా మంది వారి ఇళ్లపై ఎక్కి కూర్చుంటున్నారు’ అని చెప్పారు. ఆ గ్రామానికి చెందిన ఉబెర్ డ్రైవర్ ఆంటోనీ జాక్సన్ అక్కడి తీవ్రత గురించి తెలియ జేశాడు. సముద్ర తీరం నుంచి 600 మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన రహదారికి సోమవారం మధ్యాహ్నం నాటికి నీరు చేరుకుందని తెలిపాడు.

సముద్రపు నీరు ఇళ్లలోకి రాకుండా తీరం వెంబడి అడ్డుగా గోడ నిర్మించాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పరిస్థితికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.logo