గురువారం 21 జనవరి 2021
National - Jan 09, 2021 , 15:02:36

ఢిల్లీలో బర్డ్‌ ఫ్లూ.. వందల సంఖ్యలో కాకులు మృతి

ఢిల్లీలో బర్డ్‌ ఫ్లూ.. వందల సంఖ్యలో కాకులు మృతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కూడా బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతున్నది. మయూర్ విహార్ పార్కులో తాజాగా మరో 20 కాకులు మృతిచెందాయి. కాగా గత వారం రోజుల్లో సుమారు 200 కాకులు చనిపోయి ఉంటాయని పార్క్‌ సంరక్షకుడు టింకు చౌదరి తెలిపారు. బర్డ్‌ ఫ్లూ వ్యాధి వల్లనే ఇవి మరణించి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్కులోకి సందర్శకులను అనుమతించడం లేదన్నారు. శానిటైజేషన్‌ పనులు చేస్తున్నట్లు చెప్పారు. 

మరోవైపు కాకుల కళేబరాలను పరీక్ష కోసం పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లోని ఉత్తర ప్రాంతీయ వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలకు తరలించారు.  ఢిల్లీలోని మయూర్‌ విహార్‌ ఫేజ్‌ 3తోపాటు ద్వారక, పశ్చిమ ఢిల్లీలోని హస్తల్ గ్రామంలో వందల సంఖ్యలో కాకులు చనిపోయినట్లు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ సునీల్ సింగ్ తోమర్ తెలిపారు. అయితే ఈ ప్రాంతాల్లో కాకుల మరణానికి బర్డ్‌ ఫ్లూనే కారణమా అన్నది నిర్ధారణ కావాల్సి ఉన్నదని చెప్పారు. చనిపోయిన కొన్ని కాకుల నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపామని, మిగతా వాటిని జాగ్రత్తల మధ్య పూడ్చి వేసినట్లు వివరించారు. 

కాగా, దేశంలో ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ ప్రభావం ఉన్నదని కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా, కేరళ, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు బయటపడ్డాయని వెల్లడించింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్­లోడ్ చేసు­కోండి


logo