శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 18:13:41

అన్‌లాక్‌ 3.0: థియేటర్లు, జిమ్‌లకు అనుమతి?

అన్‌లాక్‌ 3.0: థియేటర్లు, జిమ్‌లకు అనుమతి?

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ 2.0 ఈనెల 31 శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో మరిన్ని వ్యాపార, వాణిజ్య  కార్యకలాపాలకు అనుమతినిచ్చే విషయంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.  కరోనా లాక్‌డౌన్ ఆంక్షలను దశలవారీగా‌ సడలించే ప్రక్రియలో భాగంగా కేంద్రం   అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల  చేయనుంది. ఆగస్ట్‌ 1 నుంచి మరిన్ని సడలింపులు ప్రకటించే అవకాశం ఉన్నది.  కంటైన్‌మెంట్‌ జోన్లలో యథాతథంగా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. 

అన్‌లాక్‌ 3.0లో ముఖ్యంగా సినిమా హాళ్లు, జిమ్‌లకు అనుమతించనున్నట్లు సమాచారం.  ఆగస్ట్‌ నెలలో థియేటర్ల పునఃప్రారంభానికి అనుమతులివ్వాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ.. హోంశాఖకు సిఫారసు చేసింది. థియేటర్లలో ఓ వరుసను ఖాళీగా ఉంచుతూ సీటు విడిచి మరో సీటులో ప్రేక్షకులు కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేసి  భౌతికదూరం పాటించేలా మార్గదర్శకాలను రూపొందించారు.  అలాగే ప్రతిషోకు సీట్ల శానిటైజేషన్‌ చేయాలని సూచించారు.

అన్‌లాక్‌ 3.0లో కొన్ని ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది.   దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో  పాఠశాలలు, విద్యాసంస్థలు, మెట్రో రైల్‌ సేవలు మూసివేత  కొనసాగించనున్నారు. పాఠశాలల పునఃప్రారంభంపై   రాష్ట్రాలతో మానవ వనరుల  అభివృద్ధి  మంత్రిత్వ శాఖ ఇప్పటికే   సంప్రదింపులు ప్రారంభించింది. 


logo