శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 01, 2021 , 15:16:32

10, 12 తరగతులకు స్కూళ్లు ప్రారంభం

10, 12 తరగతులకు స్కూళ్లు ప్రారంభం

బెంగళూరు: కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి నుంచి మూతపడిన స్కూళ్లు కొత్త సంవత్సరంలో తెరుచుకుంటున్నాయి. కర్ణాటకలో శుక్రవారం 10, 12 తరగతులకు పాఠశాలలను పునరుద్ధరించారు. రాజధాని బెంగళూరులో స్కూళ్లకు హాజరైన విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా తరగతి గదుల్లో సీటింగ్‌ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు మాస్కులు ధరించారు. మరోవైపు తరగతి గది బోధనకు తిరిగి హాజరుకావడంపై స్టూడెంట్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ తరగతులతో పోల్చితే ఆఫ్‌లైన్ తరగతులు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. తామంతా కరోనా మార్గదర్శకాలను పాటిస్తున్నామని విద్యార్థులు చెప్పారు.

మరోవైపు కర్ణాటకతోపాటు కేరళ, అసోం రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి తరగతులను పాక్షికంగా పునరుద్ధరించారు. కేరళలో 10, 12వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన గంటల్లో పరిమిత సంఖ్యలో స్టూడెంట్స్‌కు క్లాసులు నిర్వహించారు. అసోంలో ఎలిమెంటరీ స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు అన్ని విద్యాసంస్థలను తెరిచారు. ఈ రాష్ట్రంలో సెప్టెంబర్‌ నుంచే దశల వారీగా స్కూళ్ల పునరుద్ధరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 

కాగా బీహార్, పాండిచ్చెరితోపాటు పూణేలో జనవరి 4 నుంచి పాక్షికంగా పాఠశాలలను తెరువనున్నారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా స్కూళ్లను జనవరిలో పునరుద్ధరించేందుకు సిద్ధమయ్యాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలు ఇప్పటికే క్లాసులను పాక్షికంగా నిర్వహిస్తున్నాయి. అయితే కొత్త రకం కరోనా వ్యాప్తిపై ఆందోళన నేపథ్యంలో స్కూళ్ల పునరుద్ధరణపై కొన్ని రాష్ట్రాలు వెనుకడుగు వేస్తున్నాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo