శుక్రవారం 03 జూలై 2020
National - Jan 29, 2020 , 12:01:35

పిటిషన్‌ను కొట్టివేయండి

పిటిషన్‌ను కొట్టివేయండి
  • నిర్భయ దోషి పిటిషన్‌పై సుప్రీంకోర్టును కోరిన కేంద్రం
  • జైలులో తనపై లైంగికదాడిజరిగిందన్న ముఖేశ్‌

న్యూఢిల్లీ: ‘నిర్భయ’దోషి ముఖేశ్‌కుమార్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. క్షమాభిక్ష అభ్యర్థనపై రాష్ట్రపతి త్వరితగతిన నిర్ణయం తీసుకున్నారనే కారణంతో దాన్ని సవాల్‌చేయడం సరికాదని పేర్కొన్నది. అయితే ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అంశంపై ఇంత త్వరగా నిర్ణయం తీసుకోవడం తగదని, దీనిపై మనసు పెట్టాలని దోషి తరఫు న్యాయవాది అంజనా ప్రకాశ్‌ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును బుధవారానికి రిజర్వ్‌ చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. మరణశిక్ష పడిన దోషి రోజూ చస్తూ బతుకుతుంటాడని, క్షమాభిక్ష పిటిషన్‌పై జాప్యం చేస్తే ఆ దోషిపై అమానవీయమైన ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించారు. 


క్రూరమైన నేరానికి పాల్పడిన దోషికి.. జైలులో తన పట్ల సరిగా వ్యవహరించలేదన్న కారణంతో క్షమాభిక్ష ప్రసాదించడం తగదని పేర్కొన్నారు. మరోవైపు, దోషి తరఫున అంజనా ప్రకాశ్‌ వాదిస్తూ.. ముఖేశ్‌పై జైలులో లైంగికదాడి జరిగిందని ఆరోపించారు. క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోకముందే అతడిని జైలులో ఒంటరిగా ఉంచారని, ఇది జైలు నిబంధనలకు విరుద్ధమని అన్నారు. అతడిపై లైంగికదాడి, వేధింపులు సహా ఇతర వివరాలను రాష్ట్రపతికి పంపించలేదని వాదించారు. ఈ ఆరోపణలను తుషార్‌ మెహతా ఖండించారు. కేంద్ర హోం శాఖ అన్ని వివరాలను రాష్ట్రపతికి పంపించిందన్నారు. ముఖేశ్‌ను ఒంటిరిగా ఉంచలేదని చెప్పారు. ముఖేశ్‌ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి ఈ నెల 17న తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 


logo