శనివారం 11 జూలై 2020
National - Jun 18, 2020 , 13:57:00

పూరి జగన్నాథుడి రథయాత్ర నిర్వహించవద్దన్న సుప్రీంకోర్టు

 పూరి జగన్నాథుడి రథయాత్ర నిర్వహించవద్దన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఒడిశా రాష్ట్రంలోని పూరిలో చారిత్రక జగన్నాథుడి రథయాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ నెల 23 నుంచి జరుప తలపెట్టిన ఈ వేడుకలను కరోనా సంక్షోభం నేపథ్యంలో రద్దు చేయాలని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ప్రతి ఏటా సుమారు 10-12 రోజులపాటు సాగే పూరి జగన్నాథుడి రథయాత్రకు దేశ, విదేశాల నుంచి పది లక్షల మందికిపైగా భక్తులు తరలివస్తారు. 

అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది రథయాత్రను నిలిపివేయాలని కోరుతూ ఒడిశాకు చెందిన ఓ స్వచ్చంధ సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బొబ్డే, న్యాయమూర్తులు దినీష్ మహేశ్వరి, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. కరోనా సంక్షోభ సమయంలో అంత పెద్ద రథయాత్రకు అంగీకరిస్తే జగన్నాథ స్వామి మమ్మల్ని క్షమించడు.. అని ప్రధాన న్యాయమూర్తి బొబ్డే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యం, పౌరుల రక్షణ దృష్ట్యా చారిత్రక జగన్నాథుడి రథ యాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని ఒడిశా ప్రభుత్వాన్ని థర్మాసనం ఆదేశించింది. అలాగే దీనికి సంబంధించిన ఎలాంటి వేడుకలు చేపట్టవద్దని, భక్తులను అనుమతించవద్దని పేర్కొంది. logo