మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 01:37:15

రహదారి దిగ్బంధం తగదు

రహదారి దిగ్బంధం తగదు
  • షాహీన్‌బాగ్‌లో సీఏఏ వ్యతిరేక నిరసనలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ప్రజా రహదారిని దిగ్బంధించడం తగదని, అలాంటి చోట నిరవధిక ఆందోళనలతో ఇతరులకు అసౌకర్యం కలుగజేయవద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో గత ఏడాది డిసెంబర్‌ 15 నుంచి నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిరసనకారులు కాళిందికుంజ్‌-షాహీన్‌బాగ్‌ మార్గాన్ని దిగ్బంధించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగజేస్తున్నారని  ఇటీవల కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు సోమవారం కోర్టు విచారణ జరిపింది. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉన్నదని, అయితే ఆందోళనలకు కేటాయించిన చోటనే ఇవి జరుగాలి కానీ ఇతరులకు అసౌకర్యం కలిగే ప్రజా రహదారుల్లో కాదని న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్‌, కేఎం జోసఫ్‌లతో కూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది. మరోవైపు, షాహీన్‌బాగ్‌ నిరసనల్లో పాల్గొన్న నాలుగు నెలల బాబు మరణించిన ఉదంతంపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శిశువుతో నిరసనా? అని మండిపడింది. జనవరి 30న ఓ దంపతులు తమ నాలుగు నెలల బాబుతో కలిసి షాహీన్‌బాగ్‌ వద్ద నిరసనలో పాల్గొన్నారు. దీంతో అస్వస్థతకు గురై బాబు చనిపోయాడు. ఈ నేపథ్యంలో సాహస బాలల అవార్డు గ్రహీత జెన్‌ గుణవర్తన్‌ సదావర్తే ఇటీవల సీజేఐ కార్యాలయానికి లేఖ రాసింది. సోమవారం ఈ లేఖను పరిశీలించిన సుప్రీంకోర్టు దీనిని సుమోటోగా స్వీకరిస్తున్నట్లు చెబుతూ.. ఈ ఉదంతంపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 


logo