సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 14:36:14

రిటైర్ బ్యాంకు ఎంప్లాయిస్ కు ఎస్బీఐ శుభవార్త

రిటైర్ బ్యాంకు ఎంప్లాయిస్ కు ఎస్బీఐ శుభవార్త

 ముంబై : పదవీ విరమణ పొందిన బ్యాంకు ఉద్యోగులకు ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీ ఐ) శుభవార్త అందించింది. వివిధ హోదాల్లో పని చేసి పదవీ విరమణ పొందిన సిబ్బందికి మళ్లీ ఉద్యోగం చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నది. మాజీ ఉద్యోగులకు డోర్స్ తెరిచి వివిధ మార్గాల్లో వారిని కాంట్రాక్ట్ పైన నియమించుకుంటుంది. 63ఏండ్లు వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇందుకు సంబంధించి ప్రాంతీయ ప్రధాన కార్యాలయం లేదా ఎస్బీఐ సర్కిల్ కార్యాలయాల్లో నియామక ప్రక్రియ జరుగుతుందని ఎస్బీఐ వెల్లడించింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సర్కిల్ పరిధిలో నియామకాలను చేపట్టిన బ్యాంకు ప్రస్తుతం హైదరాబాద్, అమరావతి, పాట్నా, ముంబై మెట్రో, మహారాష్ట్ర పరిధిలో నియామకాలు చేపట్టింది.

అరవై ఏండ్లకు పదవీ విరమణ చేసిన స్కేల్ 1 నుంచి స్కేల్ 5 అధికారులు ఇందుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయస్సు 63 మించరాదు. అయితే, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వారు లేదా డిస్మిస్ అయినవారు ఇందుకు అనర్హులు. రూ.30-40 వేల మధ్య వేతనం నిర్ణయించింది. ఏడాది కాలపరిమితితో నియామకం చేస్తున్న బ్యాంకు మరో ఏడాది కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, ఎఫ్ఐఎంఎం నెట్ వర్క్, ఎనీ టైమ్ బ్యాంకింగ్, చానల్ మేనేజర్స్, సూపర్ వైజర్స్, బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్స్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఎస్బీఐ మాజీ ఉద్యోగుల నుంచి తగినన్ని దరఖాస్తులు రాకుంటే ఇతర బ్యాంకుల మాజీ ఉద్యోగులకు అవకాశమివ్వనున్నారు.  


logo