మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 13:34:45

ఎస్బీ ఐ రుణగ్రహీతలు ఆన్‌లైన్ ఎలిజిబిలిటీని ఇలా చెక్ చేసుకోవచ్చు...

 ఎస్బీ ఐ రుణగ్రహీతలు ఆన్‌లైన్ ఎలిజిబిలిటీని ఇలా చెక్ చేసుకోవచ్చు...

ముంబై : కరోనా మహమ్మారి నేపథ్యంలో చిరు వ్యాపారుల నుంచి భారీ పరిశ్రమల వరకు ఆర్థికంగా అందరిపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ సూచనలకు అనుగుణంగా అర్హత కలిగిన రిటైల్ రుణాలను ఒకసారి పునర్వ్యవస్థీకరించుకునే సదుపాయాన్నికల్పిస్తున్నది ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీ ఐ). రిటైల్ కస్టమర్లు తాము రుణ పునర్వ్యవస్థీకరణకు అర్హులమా, కాదా అని తెలుసుకునే సదుపాయాన్ని తెలుసుకునేందుకు ఎస్బీఐ పోర్టల్‌లో ఏర్పాటు చేసింది. ఏకకాల రుణాల పునర్వ్యవస్థీకరణ ద్వారా లబ్ధి పొందేందుకు అర్హతలు ఏమిటో తెలుసుకోవడంలో చేయూతను ఇచ్చేందుకు వెబ్‌సైట్‌లో ఈ-ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చారు. బ్యాంకు శాఖలను సందర్శించాల్సిన అవసరం లేకుండా ఖాతాదారులు తమ అర్హతలను ఎలక్ట్రానిక్ మోడ్‌లో తెలుసుకోవచ్చు.

ఈ-పోర్టల్ ద్వారా చెక్ చేసుకున్న అనంతరం అర్హత కలిగిన రుణగ్రహీతలు రుణ పునర్వ్యవస్థీకరణ కోసం ఓసారి సంతకాల కోసం బ్యాంకుకు వెళ్తే సరిపోతుంది. అర్హత కలిగిన కస్టమర్లు మాత్రమే బ్యాంకుకు వస్తే సరిపోతుందని సీఎస్ శెట్టి తెలిపారు. తాత్కాలికంగా ఉద్యోగ, ఉపాధి కోల్పోయి, రానున్న ఆరు నెలల నుంచి 24 నెలల కాలపరిమితిలో తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం ఉన్నవారికి తాము అండగా నిలవాలనుకుంటున్నట్లు చెప్పారు. రిటైల్ రుణాల పునర్వ్యవస్థీకరణ కింద హౌసింగ్ ఇతర అనుబంధ రుణాలు, విద్యా రుణాలు, వెహికిల్ లోన్స్, పర్సనల్ లోన్స్ వంటివి పునర్వ్యవస్థీకరించుకోవచ్చు.

ఎలా నిర్ధారించుకోవచ్చంటే... ? 

ఎస్బీఐ రిటైల్ కస్టమర్లు లోన్ రీస్ట్రక్చరింగ్ కోసం పోర్టల్‌లోకి లాగిన్ కావాలి. - వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత పునర్వ్యవస్థీకరణను తెలియజేసే విభాగంలో తమ ఖాతా నెంబర్‌ను ఎంటర్ చేయాలి. - రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత అడిగిన మిగతా వివరాలు నమోదు చేయాలి. - అప్పుడు సదరు రిటైల్ లోన్ టేకర్.. రుణ పునర్వ్యవస్థీకరణకు అర్హుడా కాదా తెలిపే సందేశం వస్తుంది. అర్హులైన కస్టమర్లకు ఒక రిఫరెన్స్ మెసేజ్ వస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.

ఈ లోగా సంబంధిత బ్రాంచీకి వెళ్లి రుణ పునర్వ్యవస్థీకరణ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. అన్ని పత్రాల పరిశీలన అనంతరం రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తవుతుంది. రుణగ్రహీతలు బ్యాంకుకు వెళ్లడానికి ముందు తమ అర్హతను తెలుసుకోవడం సౌకర్యవంతంగా ఉంటుంది. ఆర్బీఐ రూపొందించిన ప్రేమ్ వర్క్ ప్రకారం రుణగ్రహీతలకు పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. ఫ్రేమ్‌వర్క్, ఇతర నిబంధనలు, షరతుల ప్రకారం పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన వివరాలతో కూడిన డూప్లికేట్-7 కాపీని రిటైల్ రుణగ్రహీతలకు ఇస్తారు. ఆ కాపీనీ సంతకం చేసి పది రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo