సౌదీ కోటలో ఇజ్ ‘రాయల్ ’

- అరబ్ దేశాలతో పెరుగుతున్న ఇజ్రాయెల్ దోస్తీ
- ప్రాధాన్యం కోల్పోతున్న సౌదీ అరేబియా
- యువరాజు తప్పులతో సౌదీకి అరబ్ దేశాలు దూరం
- అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న యూదురాజ్యం
- చక్రం తిప్పుతున్న అమెరికా
దశాబ్దాలుగా యుద్ధాలు, తిరుగుబాట్లతో నిత్యకల్లోలంగా మారిన మధ్యప్రాచ్యం ముఖచిత్రం క్రమంగా మారుతున్నది. చమురు సంపదతో అరబ్ దేశాలన్నింటినీ కనుసైగతో నియంత్రించిన సౌదీ అరేబియా ప్రాభవం మసకబారుతున్నది. అదే సమయంలో ప్రబల శతృత్వాన్ని వదిలి యూదు దేశం ఇజ్రాయెల్.. అరబ్ దేశాలతో దోస్తీకి చేయి చాస్తున్నది.
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) తన బెదిరింపు విధానాలతో అరబ్ దేశాలన్నింటినీ దూరం చేసుకుంటున్నారు. 2017 నవంబర్‌లో సౌదీ పర్యటనకు వెళ్లిన లెబనాన్ ప్రధాని సాద్ హరిరీని బెదిరించి మీడియా ప్రత్యక్ష ప్రసారంలోనే ఆయనతో ఎంబీఎస్ రాజీనామా చేయించటంపై ఇతర అరబ్ దేశాలన్నీ తీవ్రంగా స్పందించాయి. తన విధానాల్ని నిర్భయంగా తూర్పారబట్టిన జర్నలిస్టు కషోగ్గీని దారుణంగా హత్య చేయించటంతో ఎంబీఎస్పై వ్యతిరేకత మరింత పెరిగింది. అది సౌదీ అరేబియా వ్యతిరేకతగా మారి ఆ దేశ ప్రతిష్ఠను దెబ్బతీసింది.
చమురు సంపదతో ఆధిపత్యం
1969లో అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత నుంచి అరబ్ ప్రపంచంపై పట్టు బిగిస్తూ వచ్చిన సౌదీ నిన్నమొన్నటివరకు ఇస్లామిక్ సమాఖ్య (ఓఐసీ), ఒపెక్లపై తిరుగులేని ఆధిపత్యం వహించింది. అప్పటివరకు అరబ్ దేశాలను శాసించిన ఈజిప్టు పూర్తిగా ప్రాధాన్యం కోల్పోవటంతో ఆ స్థానాన్ని సౌదీ అందిపుచ్చుకున్నది. అమెరికా, యూరప్ దేశాల మద్దతుతో ఆయుధాలను పోగేసుకున్న ఇజ్రాయెల్‌తో ముఖాముఖి యుద్ధంలో గెలువలేమని తేలిపోవటంతో దౌత్యపరంగా దాన్ని ఒంటరి చేసింది. చమురు నిల్వల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న సౌదీ, కుప్పలు తెప్పలుగా వచ్చిపడిన చమురు సంపదతో అరబ్ దేశాలన్నింటినీ శాసించే స్థాయికి ఎదిగింది. పాలస్తీనాను క్రమంగా ఆక్రమించుకున్న ఇజ్రాయెల్‌తో శాశ్వత వైరమే తన విధానంగా చేసుకున్నది.
ఇజ్రాయెల్.. దోస్తీ వ్యూహం
దశాబ్దాలుగా తన బద్ధశత్రువుగా ఉన్న ఇరాన్‌తో తన మిత్రదేశం అమెరికాసహా పశ్చిమదేశాలు 2015లో అణు ఒప్పందం చేసుకోవటంతోనే ఈ ప్రాంతంలో సౌదీ అరేబియా ప్రాభవం తగ్గటం మొదలైందని విశ్లేషకుల అభిప్రాయం. ఈ ఏడాది ఆగస్టు 13న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో ఇజ్రాయెల్ చారిత్రక దౌత్య ఒప్పందం చేసుకోవటంతో సౌదీ ప్రాధాన్యం మరింత దిగజారింది. దాదాపు 50 ఏండ్ల తర్వాత ఈ రెండుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ ఒప్పందాన్ని సౌదీ అనుంగు మిత్రదేశం అమెరికాయే దగ్గరుండి కుదుర్చటం విశేషం. తాజాగా లెబనాన్‌తో కూడా ఇజ్రాయెల్ శాంతి చర్చలు మొదలుపెట్టింది. ఈ చర్యను ఐక్యరాజ్యసమితి ఆంటోనియో గుటెర్రెస్ స్వాగతించారు. ఈ దేశాల మధ్య శాంతి చర్చలు ప్రపంచ శాంతికి శుభసూచకాలని శుక్రవారం వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఓవైపు సౌదీతో స్నేహాన్ని కొనసాగిస్తూనే.. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్‌ను బలోపేతం చేసే చర్యలను అమెరికా ముందుండి నడిపించటం గమనార్హం.
ఆర్థిక పతనంతో సతమతం
నాలుగైదు దశాబ్దాలుగా చమురు సంపదతో తులతూగిన సౌదీ అరేబియాను 2019లో సంభవించిన చమురు ధరల పతనం దారుణంగా దెబ్బతీసింది. ఆదాయం అమాంతం పడిపోవటంతో ప్రభుత్వం లోటుబడ్జెట్‌లోకి వెళ్లిపోయింది. దాంతో నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా 29 శాతానికి పెరిగింది. పొదుపు చర్యల్లో భాగంగా సబ్సిడీలు తగ్గించటంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. మరోవైపు యెమెన్‌లో ఇరాన్ మద్దతున్న హుతీ తిరుగుబాటుదారులతో జరిగిన సుదీర్ఘ యుద్ధంతో సౌదీ ఆర్థికంగా నష్టపోయింది. ప్రపంచంలోనే అత్యుత్తమ రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ హుతీ రెబల్స్ సంధిస్తున్న క్షిపణులను అడ్డుకోలేని దురవస్థలోకి సౌదీ జారిపోయింది. ఈ పరిణామాల నేపథ్యమే అరబ్ ప్రపంచానికి ఇజ్రాయెల్ దగ్గరయ్యేందుకు మార్గం సుగమం చేసింది. అమెరికా నడిపిస్తున్న ఈ రాజకీయం మున్ముందు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
- మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు?
- శ్రీమతికి మహేష్ బర్త్‌డే విషెస్.. పోస్ట్ వైరల్
- రేపు బెంగాల్, అసోంలో ప్రధాని పర్యటన
- ఈ ఫొటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..!
- 20 తీర్మానాలను ఆమోదించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ
- బోల్తాపడిన ట్రాక్టర్.. 20 మంది కూలీలకు గాయాలు
- శివమొగ్గ ఘటనపై ప్రధాని సంతాపం
- కండ్లు చెదిరే రీతిలో.. కరిగెటలో ఫుట్‌బాల్ పోటీల కసరత్తు
- ఓయూ డిస్టెన్స్‌పై పుకార్లు నమ్మొద్దు
- నేరాలను అరికట్టేందుకు.. ‘దిల్ సే’ వలంటీర్లు