మంగళవారం 14 జూలై 2020
National - Jun 25, 2020 , 01:05:30

ఎల్‌ఏసీకి ఇరువైపులా నిర్మాణాలు

ఎల్‌ఏసీకి ఇరువైపులా నిర్మాణాలు

  • గల్వాన్‌ నదిపై చైనా కల్వర్టు నిర్మాణం 
  • శాటిలైట్‌ చిత్రాల ద్వారా వెలుగులోకి  

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించిన మరుసటి రోజే చైనా దుర్నీతి బట్టబయలైంది. ఓ వైపు శాంతి కోసం చర్చలు జరుపుతూనే మరోవైపు కపట పన్నాగాలు పన్నుతున్నది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న గల్వాన్‌ లోయలో వాస్తవాధీన రేఖకు(ఎల్‌ఏసీ) ఇరువైపులా చైనా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తాజాగా బయటకువచ్చిన హైరెజల్యూషన్‌ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల 15న ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న పెట్రోలింగ్‌ పాయింట్‌ 14కు సమీపంలో పలు రక్షణాత్మక నిర్మాణాలు చేపట్టినట్లు ఈ చిత్రాల ద్వారా తెలుస్తున్నది. మాక్సర్‌ ఈ ఫొటోలను విడుదల చేసింది. మే 22కు సంబంధించిన శాటిలైట్‌ ఫొటోల్లో అక్కడ ఒకే ఒక్క టెంట్‌ మాత్రమే ఉన్నది. తాజాగా విడుదలైన ఫొటోలను పరిశీలిస్తే.. అక్కడ చైనా బలగాలకు వసతి కేంద్రాలు, గల్వాన్‌ నదిపై కల్వర్టు నిర్మించినట్లు తెలుస్తున్నది. ‘పీపీ14 వద్ద ఆక్రమణ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. ఎల్‌ఏసీకి మనవైపున చైనా నిర్మాణాలు చేపట్టినట్లు కనిపిస్తున్నది. భారీ వాహనాల కదలికలు కూడా ఉండడాన్ని బట్టి వారు అక్కడే తిష్ఠ వేసేందుకు సిద్ధపడినట్లు స్పష్టమవుతున్నది’ అని విశ్రాంత మేజర్‌ జనరల్‌ రమేశ్‌ పాది తెలిపారు.

గల్వాన్‌లో యుద్ధ విమానాల చక్కర్లు


గల్వాన్‌ లోయలో బుధవారం భారత యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. సరిహద్దుల్లో చైనా ఆగడాల నేపథ్యంలో తమ శక్తిసామర్థ్యాలను భారత బలగాలు ప్రదర్శించాయి. లెహ్‌లోని మిలిటరీ బేస్‌ నుంచి ఈ యుద్ధవిమానాలు పైకెగశాయి. లెహ్‌ వెలుపల కూడా ప్రధాన రహదారుల్లో చెక్‌పాయింట్లను ఏర్పాటుచేశారు. పట్టణంలోనూ మిలిటరీ యాక్టివిటీ పెరిగింది. 


logo