మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 03:06:40

హెర్డ్‌ ఇమ్యూనిటీ ఇప్పట్లో కష్టమే

హెర్డ్‌ ఇమ్యూనిటీ ఇప్పట్లో కష్టమే

  • 60% మందిలో యాంటీబాడీలు రావాలి
  • టీకాతో ఇమ్యూనిటీ సాధనే సరైన పద్ధతి 
  • డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌
లండన్‌: కరోనాను నిలువరించేలా ప్రజల్లో సహజసిద్ధంగా సామూహిక రోగనిరోధక శక్తి(హెర్డ్‌ ఇమ్యూనిటీ) అభివృద్ధి కావడం ఇప్పట్లో సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. వైరస్‌ వ్యాప్తితో హెర్డ్‌ ఇమ్యూనిటీ రావాలంటే ఇంకా చాలా కాలం పడుతుందని చెప్పారు. అంతకంటే టీకా ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడమే మంచి పద్ధతి అని అభిప్రాయపడ్డారు. శుక్రవారం జెనీవాలో డబ్ల్యూహెచ్‌వో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. టీకా ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడం వల్ల మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. ‘కొన్ని దేశాల్లో 20 శాతం మందిలో కరోనా వైరస్‌ ప్రతినిరోధకాలు(యాంటీబాడీలు) ఉన్నట్టు అధ్యయనాలు వెలువడుతున్నాయి. కానీ హెర్డ్‌ ఇమ్యూనిటీకి ఇది సరిపోదు. కనీసం 50-60 శాతం మందిలో యాంటీబాడీలు ఉత్పత్తి కావాలి. అప్పట్లోగా చాలా మంది మరణిస్తారు. కానీ టీకా ద్వారా మరణాల్లేకుండా హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించవచ్చు’ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా టీకా తయారీకి ఎంతో కృషి జరుగుతున్నదని, టీకా వచ్చేదాకా వైద్యులు, శాస్త్రవేత్తలు మరణాలు తగ్గించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. దాదాపు 200 రకాల టీకాలు అభివృద్ధి దశలో ఉన్నాయని సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి టీకా వస్తుందని పలు సంస్థలు చెబుతున్నా అవి అందరికీ అందుబాటులోకి రావడానికి చాలా సమయం పడుతుందని అప్పటివరకు కరోనాపై పోరు ఇలాగే కొనసాగాలని పిలుపునిచ్చారు. 


logo