శనివారం 23 జనవరి 2021
National - Dec 02, 2020 , 17:43:15

రైతులను అవమానించిన మంత్రి వీకే సింగ్‌ను తొలగించాలి: కాంగ్రెస్

రైతులను అవమానించిన మంత్రి వీకే సింగ్‌ను తొలగించాలి: కాంగ్రెస్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల బృందంలో ఎక్కువ మంది రైతులు లేరు అని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి వీకే సింగ్‌ను తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. వీకే సింగ్‌ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉండటమే కాకుండా అవమానకరంగా ఉన్నాయని కాంగ్రెస్‌ మీడియా సెల్‌ చీఫ్‌ రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా పేర్కొన్నారు. “ప్రధాని మోదీ మంత్రుల భాష, ప్రవర్తన ఇంత ఇబ్బందికరంగా, అవమానకరంగా ఉన్నది. రైతులు ఇప్పుడు ప్రభుత్వం నుంచి రైతు అని సర్టిఫికేట్ తీసుకొని ఆందోళనలో పాల్గొనాలా? ” అని సుర్జేవాలా ట్వీట్‌లో విచారం వ్యక్తం చేశారు. ఇది రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా బీజేపీ దుష్ట ఉద్దేశానికి సజీవ ఉదాహరణ. అలాంటి మంత్రులను మంత్రిమండలి నుంచి తొలగించడం భావ్యం” అని ఆయన చెప్పారు.

పార్లమెంటు సభ్యుడు, రిపున్ బోరా కూడా కేంద్ర మంత్రి వీకే సింగ్‌ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. “రైతులు నిరసన వ్యక్తం చేయడాన్ని తాను చూడలేదని వీకే సింగ్‌ చెప్పడం ఆందోళన చేస్తున్న రైతులను అవమానించడమే. ఇలాంటి వారు కేంద్ర మంత్రిమండలిలో ఉండటం మన దురదృష్టకరం” అని రిపున్‌ బోరా చెప్పారు. మంగళవారం కేంద్ర మంత్రి  వీకే సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. “ఫొటోలలో చాలా మంది రైతులుగా కనిపించడం లేదు. రైతుల పేరును అడ్డుపెట్టుకుని  ప్రతిపక్షాలు ఆడుతున్న నాటకం మాదిరిగా కనిపిస్తున్నది ” అని వ్యాఖ్యానించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo