మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 08:17:12

ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ?

ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ?

న్యూఢిల్లీ: ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో రాజకీయ డ్రామా కొనసాగుతున్నది. సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన సచిన్‌ పైలట్‌ వర్గంలోని 18 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారనే అంశంలో ఉత్కంఠ నెలకొన్నది. శుక్రవారం సాయంత్రం నుంచి వారు కనిపించకుండా పోయారు. దీంతో రాజస్థాన్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌ఓజీ) పోలీసులు ఢిల్లీ, హర్యానాలో గాలిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలోని ఓ రిసార్టులో ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లగా, స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఎస్‌ఓజీ పోలీసులు రిక్తహస్తాలతోనే వెనుతిరగాల్సి వచ్చింది. అయితే ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నారని పోలీసులు వర్గాలు తెలిపాయి.   

కాగా, తిరుగుబాటు ఎమ్మెల్యేల క్యాంపును కర్ణాకటకు తరలించారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సచిన్‌ వర్గంలోని ఓ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తాము బీజేపీ పాలిత కర్ణాటకలో లేమని, తాము అక్కడికి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నామనే విషయం వెల్లడించలేనని తెలిపారు. గత మార్చి నెలలో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆ పార్టీ నేత జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటు చేశారు. సింథియా తన 22 మంది ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్టుకు తరలించిన విషయం తెలిసిందే. 


logo