మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 16:53:00

మెత్తబడిన సచిన్ పైలట్.. రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ

మెత్తబడిన సచిన్ పైలట్.. రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఎదురుతిరిగిన సచిన్ పైలట్ మెత్తబడ్డారు. సోమవారం మధ్యాహ్నం పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో ఆయన సమావేశమయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో సచిన్ పైలట్ డిమాండ్లను పరిశీలిస్తామని రాహుల్, ప్రియాంక భరోసా ఇచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీంతో రాజస్థాన్‌లో నెల రోజులుపైగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.

ఈ నెల 14న రాజస్థాన్ అసెంబ్లీ సమావేశం జరుగనున్నది. సీఎం అశోక్ గెహ్లాట్ ఈ సందర్భంగా సభలో తన బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నారు. తనకు మద్దతుగా ఉన్న వందకుపైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జైసల్మేర్‌లోని ఓ హోటల్‌లో ఆయన ఉంచారు. సచిన్ పైలట్, ఆయనకు మద్దతుగా ఉన్న 18 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ పక్షాన ఉండాలంటూ ఆదివారం బహిరంగ లేఖ కూడా రాశారు.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశానికి ముందు రాహుల్‌తో భేటీ కోసం సమయం కోరిన సచిన్ పైలట్ సోమవారం ఆయనతోపాటు ప్రియాంకతో సమావేశమయ్యారు. కాగా, ప్రియాంక గాంధీని ఇటీవలే సచిన్ పైలట్ ఢిల్లీలో ఒకసారి కలిసినట్లు తెలుస్తున్నది. వారిద్దరి మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఆయన మెత్తబడినట్లు సమాచారం.logo