సోమవారం 28 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 14:42:00

రాహుల్ గాంధీతో భేటీకావాల‌నుకుంటున్న స‌చిన్ పైల‌ట్‌

రాహుల్ గాంధీతో భేటీకావాల‌నుకుంటున్న స‌చిన్ పైల‌ట్‌

హైద‌రాబాద్‌: రాజ‌స్థాన్ రాజ‌కీయ సంక్షోభానికి ప‌రిష్కారం దొరికిన‌ట్లు తెలుస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్‌పై పోరాటం చేసిన మాజీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్‌తో పాటు ఆయ‌న మ‌ద్ద‌తుదారులంతా మ‌ళ్లీ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్న‌ట్లు క‌థ‌నాలు వెలుబ‌డుతున్నాయి. రాజ‌స్థాన్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపేందుకు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు.  సీనియ‌ర్ నేత కేసీ వేణుగోపాల్‌తో స‌చిన్ పైల‌ట్ ట‌చ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్రియాంగా గాంధీ వ‌ద్రాతోనూ స‌చిన్ పైల‌ట్ ఇటీవ‌ల మాట్లాడిన‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే రాహుల్ గాంధీతో స‌చిన్ పైల‌ట్ భేటీ కావాల‌నుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.  

ఆగ‌స్టు 15వ తేదీ లోపే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల‌ను పైల‌ట్ బృందం క‌ల‌వాల‌నుకుంటున్న‌ది.  అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కాక ముందే ఈ భేటీ జ‌ర‌గాల‌ని స‌చిన్ పైల‌ట్ బృందం ఆశిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  అశోక్ గెహ్లాట్‌ను సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని రెబ‌ల్ ఎమ్మెల్యేలు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అయితే అసెంబ్లీలో నిర్వ‌హించే బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గాల‌ని గెహ్లాట్ ప్ర‌య‌త్నిస్తున్నారు.  ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ రాజ‌స్థాన్ రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే రెండు మూడు రోజుల్లో రాజ‌స్థాన్ స‌మ‌స్య స‌ద్దుమ‌ణుగుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. కానీ పైల‌ట్ బృందం మాత్రం ఈ వార్త‌ల‌ను ఖండిస్తున్న‌ది.
logo