శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 00:34:42

మతస్వేచ్ఛకు పరిధి ఏమిటి?

మతస్వేచ్ఛకు పరిధి ఏమిటి?
  • శబరిమల కేసులో ఏడు న్యాయ ప్రశ్నలు..
  • 17 నుంచి రోజువారీ విచారణ

న్యూఢిల్లీ: శబరిమల వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. మతస్వేచ్ఛ, మత విశ్వాసాలకు సంబంధించిన ఏడు న్యాయపరమైన ప్రశ్నలను విస్తృత ధర్మాసనానికి నివేదించాలని అభిప్రాయపడినట్టు న్యాయస్థానం సోమవారం వెల్లడించింది. ఈ ఏడు ప్రశ్నలపై తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతుందని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొన్నది. మతస్వేచ్ఛకు పరిధి ఏమిటి? ఆర్టికల్‌ 25, 26 ప్రకారం పౌరుల హక్కులు, మత హక్కులు రాజ్యాంగంలోని 3వ పీఠికలో భాగమా? మతస్వేచ్ఛకు, ప్రాథమిక హక్కులకు మధ్య సంబంధం ఉన్నదా? ఆర్టికల్‌ 25(2)(బీ) ప్రకారం హిందువులంటే ఎవరు? ఒక మతంతో సంబంధంలేని వ్యక్తికి ఆ మతాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందా? లేదా? అనే ప్రశ్నలపై తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ నెల 17 నుంచి రోజువారీ విచారణ జరుపుతుందని తెలిపింది. ఈ విస్తృత ధర్మాసనంలో చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డేతోపాటు జస్టిస్‌లు ఆర్‌ భానుమతి, అశోక్‌ భూషణ్‌, ఎల్‌ నాగేశ్వరరావు, ఎంఎం శంతనగౌడర్‌, ఎస్‌ఏ నజీర్‌, ఆర్‌ సుభాష్‌రెడ్డి, బీఆర్‌ గవాయ్‌, సూర్యకాంత్‌ సభ్యులుగా ఉంటారు.
logo