ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 08:15:15

నేటినుంచి భక్తులకు దర్శనమివ్వనున్న అయ్యప్ప

 నేటినుంచి భక్తులకు దర్శనమివ్వనున్న అయ్యప్ప

శబరిమల: ప్రముఖ పుణ్యక్షేత్రం శబ‌రి‌మలలోని అయ్యప్ప దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నారు. వార్షిక మండల మకరవిళక్కు పూజకోసం దేవ‌స్థా‌నాన్ని నిన్న సాయంత్రం తెరి‌చారు. ఈ పూజ రెండు నెలలపాటు కొనసాగనుంది. దీంతో నేటి నుంచి భక్తు‌లను దర్శనా‌నికి అను‌మ‌తి‌స్తు‌న్నారు. కరోనా నేప‌థ్యంలో దర్శనా‌లపై ట్రావె‌న్‌‌కోర్‌ దేవ‌స్వామ్‌ బోర్డు (టీ‌డీబీ) ఆంక్షలు విధించింది. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ రోజుకు కేవలం వెయ్యి మంది భక్తు‌లనే దర్శనా‌నికి అను‌మ‌తి‌స్తారు. వారాంతాల్లో రెండు వేలమంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. భక్తులు తప్పని‌స‌రిగా కరోనా నెగె‌టివ్‌ అని ధ్రువీ‌క‌రణ పత్రాన్ని తెచ్చు‌కో‌వ‌లసి ఉంటుంది. 

పంపాకు వచ్చే దారిలో పలు చోట్ల కరోనా పరీక్ష కేంద్రా‌లను ఏర్పాటు చేశారు. అక్కడే భక్తులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. కాగా, పంపా నదిలో స్నానాలపై నిషేదం విధించారు. కరోనా లక్షణాలున్నవారు, కరోనా నుంచి కోలుకున్నవారు దర్శనానికి రావద్దని టీడీబీ సూచించింది. అదేవిధంగా 60 ఏండ్లు పైబడినవారికి, పదేండ్ల లోపు పిల్లలకు శబరిమలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. కొండలు ఎక్కే సమ‌యంలో మాస్కు తప్పనిసరికాదని వెల్లడించింది. వార్షిక మండల మకరవిళక్కు పూజలు రెండు నెలలపాటు సాగనున్నాయి. దీంతో డిసెంబర్‌ 26 వరకు శబరిమల ఆలయాన్ని తెరిచే ఉంచనున్నారు.