శనివారం 23 జనవరి 2021
National - Dec 02, 2020 , 10:52:04

ఇండ్ల వద్దకే "శబరిమల అయ్యప్ప స్వామి" ప్రసాదం....

  ఇండ్ల వద్దకే

ఢిల్లీ: శబరిమల 'స్వామి ప్రసాదం'ను భక్తుల ఇండ్లవద్దకే అందించేందుకు తపాలా విభాగం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులను దృష్టిలో ఉంచుకుని, సమగ్రమైన బుకింగ్‌, పంపిణీ ప్యాకేజీని రూపొందించింది. దేశవ్యాప్తంగా విస్తరించిన తన భారీ నెట్‌వర్క్‌ ద్వారా దేశంలోని  మారుమూల ప్రాంతాకూ ప్రసాదాన్ని చేర్చనున్నది. ఇందుకోసం ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డుతో కేరళ తపాలా విభాగం ఒప్పందం చేసుకుంది.

ఒక్కో ప్యాకెట్‌కు రూ.450 చొప్పున చెల్లించి, దేశవ్యాప్తంగా ఉన్న ఏ తపాలా కార్యాలయం నుంచైనా 'అయ్యప్ప స్వామి ప్రసాదం'ను బుక్‌ చేసుకోవచ్చు. ఈ ప్యాకెట్‌లో ప్రసాదం, నెయ్యి, విభూతి, కుంకుమ, పసుపు, అర్చన ప్రసాదం ఉంటాయి. ఒక్కో భక్తుడు ఒకేసారి 10 ప్యాకెట్ల వరకు బుక్‌ చేసుకోవచ్చు. స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ప్రసాదాన్ని బుక్‌ చేసిన వెంటనే, భక్తుడి మొబైల్‌కు స్పీడ్‌ పోస్ట్‌ సంఖ్యతో సందేశం వస్తుంది. ప్రసాదం రవాణా స్టాటస్ ను తపాలా వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

 గత నెల 6వ తేదీ నుంచే ఈ సేవ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రాగా, ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9 వేల ఆర్డర్లు వచ్చాయి. రోజురోజుకు ఆర్డర్ల సంఖ్య పెరుగుతున్నది.  మండలం పూజల కోసం గత నెల 16వ తేదీ నుంచి శబరిమల ఆలయాన్ని తెరిచారు. కొవిడ్‌ కారణంగా భక్తులను పరిమిత సంఖ్యలో మాత్రమే ఆలయం వద్దకు అనుమతిస్తున్నారు. దేవస్థానం విధించిన కఠిన ఆంక్షలను పాటించని కారణంగా, పెద్ద సంఖ్యలో భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకోలేకపోతున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo