శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 17:24:43

ఇంటర్నెట్‌ కోసం చెట్టులెక్కగలవా..? గుట్టలెక్కగలవా..?

ఇంటర్నెట్‌ కోసం చెట్టులెక్కగలవా..? గుట్టలెక్కగలవా..?

కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మూసివేతకు గురయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచే చదువు ఆన్‌లైన్లో కొనసాగిస్తుండటంతో.. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కష్టాలు అన్నీఇన్నీకావు. స్మార్ట్‌ఫోన్‌ లేక కొందరు.. ఉన్నా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేక మరికొందరు.. రెండూ ఉన్నా సిగ్నల్స్‌ లేక బాధపడే వారు ఇంకొందరు.. అనునిత్యం ఆన్‌లైన్‌ చదువు కోసం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అంతా బాగే ఉన్నదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకొంటున్నా.. గ్రామాల్లోని విద్యార్థులు ఈ ఆన్‌లైన్‌ క్లాసుల కోసం సర్కస్‌ ఫీట్లు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. 

కరోనా కారణంగా పాఠశాలలు తెరువకపోవడంతో ఆన్‌లైన్‌ క్లాసులతో పాఠాలు చెప్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులు చక్కగా ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతుంటే గ్రామీణ విద్యార్థులు మాత్రం చెట్టులెక్కగలవా ఓ నరహరి.. నువ్వు గుట్టలెక్కగలవా? అని పాటలు పాడుకుంటున్నారు. పొద్దున్నే లేచి పుస్తకాల సంచీని సంకకేసుకుని ఊరావలకు లేదా చెట్లు, కొండలపైకి చేరుకుంటున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్‌ కోసం చెట్లు ఎక్కి కూర్చుంటున్న తమకు టీచర్లు చెప్పే నోట్స్‌ రాసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నదని తమ అనుభవాలను తెలిపారు పలువురు గ్రామీణ విద్యార్థులు. పాములు, కీటకాలు, జంతువులకు భయపడుతూ కొండలపై పాఠాలు వినాల్సి వస్తున్నదని పలువురు విద్యార్థులు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గ్రామీణ భారత విద్యార్థులలో 15 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి డిజిటల్ మీడియం యాక్సెస్ కలిగి ఉన్నారు. ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి కనీసం 27 శాతం మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లు అందుబాటులో లేవని ఎన్‌సీఈఆర్‌టీ సర్వే వెల్లడించింది. చాలా పేద కుటుంబాలు తమ పిల్లల చదువు కోసం స్మార్ట్‌ఫోన్ పొందడానికి ఆస్తులు అమ్ముకోవడం, ఒంటిపూట తిండికి దూరమవడం వంటి కష్టాలు పడుతున్నారు. 

రోజూ కొండెక్కుతా : రాజస్థాన్ కుర్రాడు

రాజస్థాన్ బార్మర్ జిల్లాలోని దారురా అనే చిన్న గ్రామానికి చెందిన జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థి హరీష్ కుమార్ ప్రతిరోజూ గ్రామం సమీపంలోని కొండపైకి ఎక్కి ఇంటర్నెట్ సదుపాయం కోసం తంటాలు పడుతూ ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నాడు. అయితే ఎండలు, వానల కారణంగా కొన్నిరోజులుగా కొండపైన ఇబ్బంది పడుతున్నట్లు హరీష్‌ కుమార్‌ చెప్పాడు.

పాఠాలు వినాలంటే చెట్టెక్కుతాం

మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలోని ధడ్గావ్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ పవార్ మిగతా విద్యార్థులతో కలిసి ఆన్‌లైన్ తరగతుల కోసం ఊరి ఆవల ఉన్న చెట్లపైకి ఎక్కుతారు. దాదాపు రెండు, మూడు గంటలు అలా చెట్లపైనే ఉండి ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతున్నాడు.

ఇంటర్నెట్ కోసం ఇంటి పైకెక్కుతాం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ధన్పురాకు చెందిన విద్యార్థులు కూడా ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే ఇంటి పైకెక్కి కూర్చుండి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పొంది తరగతులు వింటున్నారు. ఈ ఊరిలోని విద్యార్థులంతా ఉదయాన్నే ఇండ్లపైకి ఎక్కి కూర్చోవడం కనిపిస్తుంది. 

అడవి గుండా ట్రెక్కింగ్ చేస్తాం

గోవాలోని సుర్లా అనే చిన్న గ్రామానికి చెందిన విద్యార్థులు 3 కిలోమీటర్ల దూరంలోని కొండపైకి ట్రెక్కింగ్‌ చేసి అడవిలో చదువుకుంటున్నారు. కేవలం అక్కడే ఆన్‌లైన్ తరగతుల కోసం లేదా స్టడీ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటానికి స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ పొందుతున్నారు. 7, 8 తరగతుల విద్యార్థులు నోట్స్‌ డౌన్‌లోడ్ చేసుకోవనికి అడవిలో పాములు, క్రిమికీటకాలు, అడవి జంతువుల బారి నుంచి తమను తాము రక్షించుకుంటూ.. వర్షానికి తడవకుండా చిన్న ప్లాస్టిక్‌ గుడారంలో కూర్చుంటున్నారు.