శనివారం 06 జూన్ 2020
National - May 13, 2020 , 17:04:39

అర్ధాకలితో నెట్టుకొస్తున్న గ్రామీణ భారతం

అర్ధాకలితో నెట్టుకొస్తున్న గ్రామీణ భారతం

న్యూఢిల్లీ: భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అంటారు. కరోనా లాక్‌డౌన్ ఫలితంగా దేశంలోని గ్రామాల్లో తిండికి కొరతగా ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. అసోం, బీహార్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని 5 వేల గ్రామాల్లో స్వచ్ఛంద సంస్థలు ఈ సర్వే నిర్వహించాయి. కోరనా వ్యాప్తి నిరోధానికి గానూ మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. 'కోవిడ్ లాక్‌డౌన్ పరిస్థితులను గ్రామాలు ఎలా ఎదుర్కొంటున్నాయి' అనే శీర్షికతో 47 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. 50 శాతం కుటుంబాలు భోజనాల సంఖ్య తగ్గిస్తే 68 శాతం కుటుంబాలు కొన్నిరకాల వంటలను తగ్గించాయి. 84 శాతం కుటుంబాలు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహారపదార్థాలను పొందుతున్నాయి. 37 శాతం కుటుంబాలకు అంగన్వాడీల ద్వారా ఆహారం అందుతున్నది. సుమారు 24 శాతం కుటుంబాలు ఉద్దెరకు కిరాణా సామాన్లు తెచ్చుకుంటున్నాయి. 12 శాతం కుటుంబాలు ఉచిత ఆహార పదార్థాలను పొందుతున్నాయి. అధ్యయనం ఫలితాలను బుధవారం ఓ వెబినార్‌లో విడుదల చేశారు. సులభంగా చేరుకోగల గ్రామాల్లోనే ఈ సర్వే నిర్వహించామని, మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉండవచ్చని స్వచంఛంద సంస్థ ప్రదాన్ ప్రోగ్రాం డైరెక్టర్ మధు ఖేతాన్ చెప్పారు. కొన్ని ఆరోగ్యపరమైన అంశాలు కూడా సర్వేలో దృష్టికి వచ్చాయని మరో స్వచ్ఛంద సంస్థ బీఏఐఎఫ్ అధ్యక్షుడు గిరీశ్ సోహానీ చెప్పారు.


logo