గురువారం 21 జనవరి 2021
National - Dec 20, 2020 , 23:58:42

కొవిడ్‌-19 వ్యాక్సినేషన్ తర్వాత సీఏఏ రూల్స్‌ ఖరారు

కొవిడ్‌-19 వ్యాక్సినేషన్ తర్వాత సీఏఏ రూల్స్‌ ఖరారు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిబంధనలు, రూపురేఖలు త్వరలో ఖరారవుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నతర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘సీఏఏ నిబంధనల రూపకల్పన సామూహిక ప్రక్రియ. కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలోనే సీఏఏ ప్రక్రియ చేపట్టలేదు. కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగానే.. సీఏఏ నిబంధనల రూపకల్పనను పరిశీలిస్తాం‘ అని పశ్చిమబెంగాల్‌లో ఆదివారం మీడియాతో అన్నారు. బుజ్జగింపు రాజకీయాల కోసమే పశ్చిమబెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌.. బంగ్లాదేశ్‌ నుంచి చొరబాట్లను నిలువరించడం లేదని మమతాబెనర్జీపై మండిపడ్డారు. దీన్ని బీజేపీ మాత్రమే నిలువరించగలదని అమిత్‌షా వ్యాఖ్యానించారు. 

కొన్ని రోజుల క్రితం బీజేపీ నేత కైలాష్‌ విజయ్‌వర్గీయ మాట్లాడుతూ అసోంలో తప్ప బెంగాల్‌లో జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ) చేపట్టబోమన్నారు. కానీ పశ్చిమబెంగాల్‌లో సీఏఏ అమలు చేయడానికి కేంద్రం ముందుకు వెళ్లనున్నది. సీఏఏ ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి, ఫ్రిబవరిలలో ప్రారంభం కానున్నదని అమిత్‌షా చెప్పారు. సీఏఏకు పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ మాత్రం తాము రాష్ట్రంలో సీఏఏ అమలు చేయబోమన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌-మే మధ్య పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఏఏ నిబంధనల రూపకల్పన సంగతి అమిత్‌షా వెల్లడించడం గమనార్హం. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo